Calcium Tablets: కాల్షియం టాబ్లెట్లు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయా?
Calcium Tablets: కాల్షియం టాబ్లెట్లు రోజూ మింగే వారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందా?
Calcium Tablets: వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం కాల్షియం శోషించుకోవడం తగ్గిస్తూ ఉంటుంది. అందుకే ఎముకలు అనారోగ్యానికి గురవుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్, ఆస్టియోపొరాసిస్ వంటి వ్యాధులు వస్తాయి. వీటిని నివారించడానికి వైద్యులు క్యాల్షియం టాబ్లెట్లను ఇస్తారు. అయితే క్యాల్షియం టాబ్లెట్లను ప్రతిరోజూ మింగే వారిలో భవిష్యత్తులో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ అని ఎంతోమంది భయపడుతూ ఉంటారు. ఇది నిజమో కాదో వైద్యులు వివరిస్తున్నారు. శరీరంలో క్యాల్షియాన్ని భర్తీ చేయడం అంటే ఏమిటో, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారణాలేంటో తెలుసుకోవాలి. అలాగే వాటి మధ్య సంబంధాన్ని ముందుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?
కిడ్నీలో రాళ్లు అనేవి క్యాల్షియం, ఆక్సలైట్, ఫాస్పరస్ వంటి పదార్థాలు మూత్రంలో పేరుకుపోవడం వల్ల గట్టి నిక్షేపాలుగా మారుతాయి. ఆ గట్టి నిక్షేపాలే చివరకు స్టోన్స్‌గా రూపాంతరం చెందుతాయి. ఇవి చిన్న చిన్న స్ఫటికాలు, గులకరాయిల్లా ఉంటాయి. అవి మూత్రపిండాల్లోనూ, మూత్ర నాళంలోనూ ఉండిపోతాయి. అప్పుడు తీవ్రమైన నొప్పికి కారణం అవుతాయి. కిడ్నీలో రాళ్లు క్యాల్షియం, ఆక్సలైల్‌ల వల్ల ఎక్కువగా ఏర్పడతాయి. ఆ రాళ్ల వల్ల వీపు కింద తీవ్రమైన నొప్పి వచ్చి పోతూ ఉంటుంది. అలాగే పొత్తికడుపు దగ్గర కూడా నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. మూత్రంలో రక్తం కనిపించడం, వాంతులు కావడం, వికారం వంటివి కూడా సంభవిస్తాయి. కొన్ని సందర్భాల్లో జ్వరం, చలివేయడం వంటివి జరుగుతాయి. వెంటనే వైద్య చికిత్స తీసుకోవడం అవసరం.
ఇక కాల్షియం సప్లిమెంట్లను వైద్యులు అందించడానికి కారణం ఎముకలకు కావాల్సినంత కాల్షియం ఆహారం ద్వారా అందకపోవడమే. ఆహారం ద్వారా కాల్షియాన్ని తగినంత తీసుకుంటే ప్రత్యేకంగా కాల్షియం టాబ్లెట్లు మింగాల్సిన అవసరం రాదు. క్యాల్షియం సప్లిమెంట్ల వల్లే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని అధ్యయనాలు ఒప్పుకోవడం లేదు. కాల్షియం సప్లిమెంట్ల వల్లే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పలేమని అంటున్నాయి పరిశోధనలు. అయితే అధిక మొత్తంలో కాల్షియం తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం మాత్రం ఉంది. అది టాబ్లెట్ల రూపంలో అయినా, ఆహారం ద్వారా అయినా అవసరానికి మించి తీసుకుంటే మాత్రం అవి రాయిలుగా మారవచ్చు. క్యాల్షియం సప్లిమెంట్లను అధిక మోతాదులో తీసుకుంటూ, ఆక్సలైట్లు అధికంగా ఉండే చాక్లెట్లు, నట్స్, కొన్ని రకాల ఆకుకూరలు, బీట్రూట్‌లు వంటివి ఒకే సమయంలో తింటే మాత్రం కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఏర్పడుతుంది.
కొందరికి జన్యుపరమైన కారణాల వల్ల వారసత్వంగా కూడా కిడ్నీలో రాళ్ల సమస్య రావచ్చు. డిహైడ్రేషన్ సమస్య కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి దోహదపడుతుంది. కాబట్టి తగినంత నీరును కచ్చితంగా తీసుకోవాలి. మీరు తగ్గితే రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. సమతుల ఆహారాన్ని తీసుకుంటే కాల్షియం మన శరీరానికి ఎంత అవసరమో అంతే శరీరంలో చేరుతుంది. పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, బలవర్థకమైన ఆహారాల ద్వారా కాల్షియం పొందితే మంచిది. క్యాల్షియం సప్లిమెంట్లు అవసరం అయితేనే వేసుకోవాలి. అనవసరంగా వేసుకోకూడదు. అలాగే కాల్షియం నిండిన ఆహార పదార్థాలను తింటున్నప్పుడు ఆక్సలైట్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.