తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Maoist : పిల్లలు పుట్టకుండా మావోయిస్టులు ఆపరేషన్‌ చేయించుకుంటారా?

Maoist : పిల్లలు పుట్టకుండా మావోయిస్టులు ఆపరేషన్‌ చేయించుకుంటారా?

16 December 2024, 13:07 IST

google News
    • Maoist : మావోయిస్టులు నిత్యం అడవుల్లో ఉంటారు. పీడిత ప్రజల పక్షాన పోరాడతామని చెబుతుంటారు. అయితే.. ఇటీవలి కాలంలో మావోయిస్టులు బలహీనపడ్డారు. ఈ క్రమంలో ఓ ఆంశం ఆసక్తికరంగా మారింది. మావోయిస్టులు పిల్లలు పుట్టకుండా ముందే ఆపరేషన్ చేయించుకుంటారని తెలిసింది.
మావోయిస్టులు
మావోయిస్టులు

మావోయిస్టులు

మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తున్నాయి. వారికి జీవనోపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఆయుధాలను వదిలి అజ్ఞాతం వీడిలాని విజ్ఞప్తి చేస్తున్నాయి. అయినా అడవుల్లోనే ఉండి ఉద్యమం చేసేవారికి వార్నింగ్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా ఓ అంశం ఆసక్తికరంగా మారింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం జగదల్‌పుర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన మాజీ మావోయిస్టులతో కాసేపు మాట్లాడారు. ఈ సమయంలో.. తెలంగాణకు చెందిన ఓ మాజీ మావోయిస్టు అమిత్ షాకు ఆసక్తికరమైన విషయం చెప్పారు.

'సీనియర్‌ మావోయిస్టు నేతల ఆదేశాల మేరకు పెళ్లికి ముందు తాను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వచ్చింది. జనజీవన స్రవంతిలో కలిశాక తిరిగి దానికి విరుగుడు శస్త్రచికిత్స చేయించుకున్నా. ప్రస్తుతం ఓ బాబు ఉన్నాడు. పిల్లలు పుడితే ఉద్యమంపై అంతగా దృష్టిపెట్టరన్న ఉద్దేశంతో.. మావోయిస్టు నేతలు తమ దళ సభ్యులకు అలా ఆపరేషన్లు చేయిస్తుంటారు' అని మాజీ మావోయిస్టు అమిత్ షాకు చెప్పారు.

మాజీ మావోయిస్టులతో మాట్లాడటం తనకు చాలా సంతోషంగా ఉందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఉద్యమాన్ని వీడి లొంగిపోయేలా మాజీ సహచరులకు సందేశం పంపించాలని వారికి సూచించారు. లేనిపక్షంలో భద్రతా బలగాల చేతుల్లో వారికి చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టురహితంగా మారుతుందని.. అమిత్ షా స్పష్టం చేశారు.

నరమేధం కొనసాగుతోంది..

సామ్రాజ్యవాదులు, దేశ, విదేశీ కార్పొరేట్లు, దోపిడీ పాలకుల సొంత లాభాల కోసమే.. భారతదేశంలో మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో ఈ నరమేధం కొనసాగుతుందని.. ఆ పార్టీ దళ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉండి దేశ సంపదను, శ్రమను కారు చౌకగా అమ్మడానికి, దోపిడీ అనుకూల విధానాలు సరళం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

దేశ వనరులను, శ్రమను కాపాడే లక్ష్యంతో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో పీడిత ప్రజల వైపు పోరాడుతున్నామని మావోయిస్టు దళ సభ్యులు చెబుతున్నారు. ఈ ప్రజా పోరాటాలు వారి సొంత లాభాలకు అడ్డుగా మారడంతో.. మావోయిస్టు పార్టీని, పీడిత ప్రజలను నిర్మూలించాలని పథకం పన్నారని ఆరోపిస్తున్నారు. దోపిడీ వర్గాలు తమ ఆర్థిక సంక్షోభాలను, తమ మార్కెట్ విస్తరణను యుద్ధం ద్వారా పరిష్కరించుకోవాలనుకుంటారని ఫైర్ అవుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆపరేషన్ కగార్‌ను కొనసాగిస్తున్నాయని మావోయిస్టు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్లకు దోచిపెట్టడంలో, మావోయిస్టు పార్టీని నిర్మూలించడంలో బీజేపీ, కాంగ్రెస్‌లు వేర్వేరు కాదంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి సాయుధ బలగాల మద్దతుతో పాటు ఆర్థిక బలం కావాలన్నారని.. ఆనాటి నుంచి కాంగ్రెస్ మావోయిస్టు పార్టీపై నిర్బంధాన్ని పెంచిందని అంటున్నారు.

తదుపరి వ్యాసం