Donald Trump: ‘‘డోనాల్డ్ ట్రంప్ ను హత్య చేసే ఆలోచన మాకు లేదు’’: అమెరికాకు ఇరాన్ సందేశం
Trump: గత వైషమ్యాల కారణంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ అధికారంలోకి రావడాన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ట్రంప్ పై హత్యాయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో.. యూఎస్ తో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ట్రంప్ ను హత్యచేసే ఆలోచన లేదని అమెరికా ప్రభుత్వానికి ఇరాన్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేసే ఆలోచన తమకు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ సీనియర్ దౌత్యవేత్తలు ఈ వారం ట్రంప్ సలహాదారు, బిలియనీర్ వ్యాపారవేత్త అయిన ఎలాన్ మస్క్ (elon musk) తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో నాలుగేళ్లు యూఎస్ అధ్యక్షుడిగా వ్యవహరించే ట్రంప్ తో సత్సంబంధాలనే కొరుకుంటున్నామని ఇరాన్ ఈ సందర్భంగా మస్క్ కు స్పష్టం చేసినట్లు సమాచారం.
లిఖిత పూర్వక హామీ
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ట్రంప్ ను చంపడానికి తాము ప్రయత్నించబోమని సూచిస్తూ ఇరాన్ గత నెలలో జో బైడెన్ (joe biden) ప్రభుత్వానికి లిఖితపూర్వక సందేశాన్ని పంపించింది. అమెరికా గతంలో చేసిన హెచ్చరికకు ప్రతిస్పందనగా అక్టోబర్ 14న స్విస్ దౌత్యవేత్తల ద్వారా ఈ సందేశాన్ని ఇరాన్ పంపించింది. అయితే ఇరు దేశాల మధ్య జరిగిన అధికారిక సందేశాల గురించి తాము బహిరంగ ప్రకటనలు ఇవ్వడం లేదని ఇరాన్ ఐరాస మిషన్ తెలిపింది.
ట్రంప్ పై వ్యతిరేకత
ట్రంప్ రెండోసారి అధికారంలోకి రావడాన్ని టెహ్రాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆయన వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఇరాన్ భావిస్తోంది. గతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఇరాన్ తో అమెరికా (US) అణు ఒప్పందాన్ని రద్దు చేశాడు. ఇరాన్ పై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించాడు. ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీని హతమార్చాలని ఆదేశించాడు. ఈ నేపథ్యంలో, ట్రంప్ మరోసారి అధికారంలోకి రావడం ఇరాన్ కు రుచించడం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా ట్రంప్ పై తన అసహనాన్ని పదేపదే వ్యక్తం చేశారు. అయితే అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం పొందేందుకు ట్రంప్ తో చర్చలకు కొత్తగా నియమితులైన సంస్కరణవాద అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తలుపులు తెరిచే ఉంచారు.
ట్రంప్ హత్యకు కుట్ర
ట్రంప్ హత్యకు కుట్ర పన్నినట్లు ఇరాన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వ అధికారి ఒకరు ట్రంప్ (donald trump) ను హత్య చేయడం కోసం తనకు పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చాడని ఇరాన్ కు చెందిన ఒక వ్యక్తి వెల్లడించాడు. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది.