రేపే అట్లతద్ది- పాటించాల్సిన విధి విధానాలు, చదువుకోవాల్సిన వ్రత కథ ఇదే
అక్టోబర్ 20 ఆదివారం నాడు అట్లతద్ది పండుగ వచ్చింది. స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం ఉండాలని కోరుకుంటూ ఈ నోము చేసుకుంటారు. అట్లతద్ది రోజు పాటించాల్సిన విధి విధానాలు, ఈ వ్రత కథ గురించి అధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
అట్లతద్దికి దేశవ్యాప్తంగా ఎంతో విశిష్టత ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పెళ్లి కాని యువతులు, పెళ్లైన స్త్రీలు ఈ పండుగను పరమ పవిత్రంగా జరుపుకుంటారు అని చిలకమర్తి చెప్పారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దీనిని వివిధ పద్ధతుల్లో చేసుకుంటారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను అట్లతద్ది అని చెబుతుంటారని చిలకమర్తి చెప్పారు. పెళ్లైన స్త్రీలు సౌభాగ్యం కోసం ఉదయం నుంచి ఉపవాసం చేసి అమ్మవారిని నిష్టగా పూజిస్తారని తెలిపారు.
అట్లతద్ది కథ (చంద్రోదయ గౌరీ వ్రతం)
అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారికి సుకుమారి అను పేరు గలిగిన ఒక కుమార్తె ఉంది. ఆమె పేరుకు తగినట్లుగా సుకుమారముగా ఉంటుంది. ఆమెకు నలుగురు స్నేహితురాండ్రు గలరు. వారు వెలమవారి అమ్మాయి, బ్రాహ్మణుల అమ్మాయి, కోమట్ల అమ్మాయి, కాపువారి అమ్మాయి. ఆ రాకుమారి అట్లతద్ది నోము నోచుకుంటే పడుచువాడు, ఆరోగ్యవంతుడు, అందగాడు అయిన భర్త వస్తాడని పెద్దల వలన విన్నది. తన స్నేహితురాండ్రతో కలిసి అట్లతద్ది నోము పట్టింది.
పగలంతా పచ్చి మంచినీరు కూడా ముట్టకుండా ఉపవాసమున్నారు. వారిలో సుకుమారి అయిన రాజకుమార్తె మూడు జాములు దాటేసరికి కళ్ళుతిరిగి పడిపోయినది. ఆమె అన్నలు వచ్చి తమచెల్లెలు పడిపోవుటకు గల కారణమును, చంద్రుని చూచేవరకు ఏమియు తినరాదనే నోముకు గల నియమమును గూర్చి తెలుసుకొన్నారు. చెల్లెలియందు ప్రేమచే చంద్రుడు వచ్చేవరకు తమ చెల్లెలు ఉండలేదని అనుకున్నారు. పిమ్మట దగ్గరలో ఉన్న ఆరికకుప్పకు నిప్పంటించి ఆ మంటను చెల్లెలికి చూపించి అడుగో చంద్రుడు వచ్చినాడని చెప్పి అద్దములో కనిపించుచున్న మంటను చంద్రునిగా భ్రమింప చేసారు. ఆమె నిజంగానే చంద్రుడు వచ్చినాడని తలచి భోజనము చేసినది. చెలికత్తెలు మాత్రము చంద్రోదయమైన తరువాత భుజించినారు.
కొంతకాలమునకు రాకుమారి సుకుమారికి పెండ్లియీడు రాగానే అన్నలు ఆమెకు సంబంధములు చూశారు. ఎంత తిరిగి వెదికినను ముసలి పెళ్ళికొడుకులే గాని పడుచువారు దొరుకుట లేదు. సక్రమముగా నోము నోచుకున్న ఆమె చెలికత్తెలందరికీ పడుచు భర్తలే వచ్చినారు. రాకుమార్తె అన్నలు విసిగిపోయి చివరకు ముసలి వానికి తమ చెల్లెలిని యిచ్చి పెండ్లి చేయుటకు నిశ్చయించినారు. ఆ విషయము తెలుసుకున్న రాకుమార్తె “అయ్యో! అట్లతద్ది నోము నోచుకొన్న వారికి పడుచుమగడు వస్తాడని చెప్పారు. నాకేల ఈ ముసలి మగడు దాపురించుచున్నాడని విచారించి, ముసలివానిని చేసుకొనుటకు ఇష్టపడ లేదు. అన్నలు బలవంతముగా నయిన పెండ్లి జరిపించాలని నిశ్చయించు కొన్నారు.
అంతట రాకుమారి ఒకనాటి రాత్రి ఎవ్వరికీ తెలియకుండా ఊరి చివర ఉన్న అరణ్యమునకు బోయి ఒక మట్టిచెట్టు క్రింద తపస్సు చేసింది. కొద్ది రోజులకు లోక సంచారమునకై అటుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు రాకుమార్తెను జూచి “ఓ చినదానా! నీవు ఈ వయస్సులో ఈ అడవిలో ఒంటరిగా తపస్సు చేయుచున్నావెందులకు అని ప్రశ్నించినారు. అందులకామె "మీరు ఆర్చేవారా? తీర్చేవారా? నా గొడవ మీకెందులకు?" అని జవాబిచ్చినది.
పార్వతీ పరమేశ్వరులు జాలిపడి 'ఓ అమాయకురాలా! ఆర్చేవారమూ మేమే, తీర్చేవారమూ మేమే. నీకు వచ్చిన కష్టమును మాకు చెప్పుము. నీ కష్టమును తీర్చి నీకు మేలు చేస్తాము అని అనగా ఆ రాకుమారి తన దురదృష్టమును గూర్చి వారికి విన్నవించినది. పార్వతీ పరమేశ్వరులు ఆమె మాటలు విని ఓ చిన్నదానా! నీవు అట్లతద్ది నోముపట్టి ఉపవాసముతో సొమ్మసిల్లి పడిపోయినావు. నీ అన్నలు అద్దములో మంటను చంద్రునిగా భ్రమింపచేసారు. అది చూచి నీవు చంద్రుడు కనిపించినాడని భోజనము చేయుటచేత ఉల్లంఘనమైనది. కావున నీవు ఇంటికి వెళ్ళి యధావిధిగా అట్లతద్ది నోము నోచుకుంటే నీకు పడుచు మగడు లభించునని చెప్పి అదృశ్యమయినారు. అంతట రాకుమారి ఇంటికి వెళ్ళి జరిగిన సంగతిని అన్నలకు తెలిపినది. అంతట వారు తమ చెల్లెలిచేత తిరిగి సక్రమముగా అట్లతద్ది నోము నోపించినారు. దాని ఫలితముగా ఆమెకు చక్కని పడుచువానితో పరిణయము జరిగి సుఖంగా జీవించింది.
ఉద్యాపనం
అట్లతద్ది రోజున ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని తల స్నానం చేయాలి. ఆరోజంతా ఉపవాసం ఉండి చీకటి పడగానే గౌరీదేవిని పూజించి పది అట్లు నైవేద్యము పెట్టాలి. పది అట్లను, ఒక తోరమును ముత్తైదువునకు వాయనమియ్యవలెను. అట్లు పది సంవత్సరములు చేసిన పిమ్మట ఒక్కొక్కరికి పదేసి అట్లు, నల్లపూసల కోవ, లక్కజోళ్ళు, రవికలగుడ్డ, దక్షిణ తాంబూలములతో కలిపి పదిమంది ముత్తయిదువులకు వాయనములు ఇవ్వవలెను. కథ లోపమైనా వ్రతలోపము కారాదు. భక్తి తప్పకున్న ఫలము కల్గును అని ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చెప్పారు.