Atla tadde 2024: అట్లతద్ది ఎప్పుడు వచ్చింది? పండుగ రోజు ఇలా చేస్తే జాతకంలో కుజ దోషం తొలగిపోతుంది
Atla tadde 2024: అట్లతద్ది పండుగను ఈ ఏడాది అక్టోబర్ 20న జరుపుకోనున్నారు. స్త్రీలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో అట్లతద్ది ఒకటి. ఈరోజు ఆడపడుచులు అందరూ అట్లు ఒకరికొకరు వాయనంగా ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ పండుగ విశిష్టత ఏంటి? ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం.
అట్లతద్ది పండుగ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అట్లు. ప్రతి ఒక్కరూ తామ ఇళ్లలో అట్లు పోసుకుని ఇరుగుపొరుగు ఒక చోటకు చేరి వాటిని ఒకరికొకరు వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ ఏడాది అట్ల తద్ది పండుగ అక్టోబర్ 20న వచ్చింది.
గ్రామీణ ప్రాంతాల్లో అట్లతద్ది వేడుకలు చాలా ఉత్సాహంగా సందడిగా జరుగుతాయి. ఇళ్ల దగ్గర ఉన్న చెట్లకు పెద్ద పెద్ద ఉయ్యాలలు కట్టి సంతోషంగా ఊగుతారు. “అట్లతద్ది ఆరట్లు… ముద్దపప్పు మూడట్లో” అంటూ తెలుగింటి ఆడపడుచులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ అట్లతద్ది. ఆశ్వయుజ బహుళ తదియ నాడు అట్లతద్ది జరుపుకుంటారు. స్త్రీలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగని గోరింటాకు పండుగ, ఉయ్యాల పండుగ అని కూడా పిలుస్తారు. దక్షిణాది వాళ్ళు అట్లతద్ది జరుపుకుంటే ఉత్తర భారతీయులు కర్వా చౌత్ వేడుక చేసుకుంటారు .
పెళ్లి కాని యువతులు తమకు మంచి జీవిత భాగస్వామి రావాలని ఈ వ్రతం ఆచరిస్తారు. పెళ్లయిన స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటూ ఈ నోము జరుపుకుంటారు. పొద్దున్నే లేచి ఆడవాళ్లు ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం ఆచరించి పూజ చేసుకుంటారు. అమ్మవారికి అట్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీదేవిని పూజిస్తారు. శివుడిని భర్తగా పొందాలని గౌరీదేవి చేసిన తొలి వ్రతం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం ఇది.
కుజ దోషం తొలగిపోతుంది
ఈ వ్రతం చేసుకోవడం వల్ల జాతకంలో ఉన్న కుజదోషం కూడా తొలగిపోతుంది. ఎందుకంటే ఈరోజు నైవేద్యంగా సమర్పించే అట్లు అంటే కుజుడికి మహా ప్రీతి. వీటిని నైవేద్యంగా సమర్పించడం వల్ల వైవాహిక జీవితంలో ఎటువంటి అడ్డంకులు రావని, దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అట్లు వేసేందుకు ఉపయోగించే మినుములు, బియ్యం కూడా గ్రహాలకు సంబంధించినవే. మినుములు రాహువుకు చెందితే బియ్యం చంద్రుడికి సంబంధించినవిగా చెప్తారు. గర్భ దోషాలు, గర్భస్రావము వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు అట్లతద్ది రోజు అట్లు వాయనంగా ఇరుగుపొరుగుకి సమర్పించాలి. ఇలా చేస్తే గర్భధారణ సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
పూజా విధానం
అట్ల తద్ది రోజు ఇంట్లో తూర్పు దిక్కున మండపాన్ని ఏర్పాటు చేసుకొని గౌరీదేవిని ప్రతిష్టించుకుని పూజ చేయాలి. మొదటిగా వినాయక పూజ చేసిన అనంతరం గౌరీదేవిని పూజించాలి. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. గౌరీదేవికి సంబంధించిన మంత్రాలు, శ్లోకాలు పఠించాలి. మరలా సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత పూజ చేసి 11 అట్లు నైవేద్యంగా పెట్టి ముత్తైదువులకు వాటిని వాయనంగా ఇవ్వాలి. 11 పండ్లు తింటూ, 11 మార్లు తాంబూలం వేసుకుని, 11 మార్లు ఊయల ఊగుతారు. అందుకే దీనిని ఉయ్యాల పండుగ అని కూడా పిలుస్తారు.
ముందు రోజే మహిళలంతా తమ చేతులకు, పాదాలకు గోరింటాకు పెట్టుకొని సందడిగా ఉంటారు. అట్లతద్ది రోజు మహిళలకు మేకప్ వస్తువులు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తమ ఐదోతనం కలకాలం ఉంటుందని విశ్వాసం.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.