CM Revanth Reddy : మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు కేటాయించండి- కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
22 July 2024, 20:40 IST
- CM Revanth Reddy : తెలంగాణకు రావాల్సిన బకాయిలు, వివిధ పథకాల కింద నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కోరారు. దిల్లీ పర్యటనలో వరుసగా కేంద్రమంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు కేటాయించండి- సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్‌కు సహకరించాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని, దానిని శుద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేంద్ర మంత్రికి తెలిపారు. జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనులకు రూ.4 వేల కోట్లు, గోదావరి నది జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లతో నింపే పనులకు రూ.6 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను గోదావరి నీటితో నింపితే హైదరాబాద్ నీటి ఇబ్బందులు ఉండవని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు.
జల్ జీవన్ మిషన్ నిధులు
2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనా జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక పథకం కింద ఇప్పటి వరకు తెలంగాణకు నిధులు ఇవ్వలేదన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి. నల్లా లేని 7.85 లక్షల ఇళ్లతో పాటు పీఎంఏవై (అర్బన్), (రూరల్) కింద చేపట్టే ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు రూ.16,100 కోట్ల వ్యయమవుతుందని సీఎం తెలిపారు. ఈ ఏడాది నుంచి జల్‌జీవన్ మిషన్ నిధులు తెలంగాణకు కేటాయించాలని కోరారు.
బియ్యం సేకరణ బకాయిలు
కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ. 1468.94 కోట్ల రాయితీని విడుదల చేయాలని కోరారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనకు సంబంధించి 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987.730 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన రూ. 343.27 కోట్లను విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరారు. 2021 మే నుంచి 2022 మార్చి వరకు నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ. 79.09 కోట్లు విడుదల చేయాలని కోరారు.
గ్యాస్ సిలిండర్ రాయితీపై
పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి తెలియజేశారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.