CM Revanth Reddy : మూడు విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన-hyderabad cm revanth reddy says crop loan waiver completed in three stages by august ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : మూడు విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

CM Revanth Reddy : మూడు విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Bandaru Satyaprasad HT Telugu
Jul 17, 2024 05:18 PM IST

CM Revanth Reddy On Crop Loan : రూ.2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మూడు విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించారు.

మూడు విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
మూడు విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

CM Revanth Reddy On Crop Loan : మూడు విడతల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టులో రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. బుధవారం ప్రజాభవన్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారని సీఎం గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉంచి కూడా కేసీఆర్ రూ.28 వేల కోట్లు రైతు రుణమాఫీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో చెప్పామన్నారు. ఆర్థిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారని, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని, పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు.

తెలంగాణ మోడల్ ను దేశం అనుసరించేలా

"గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. రాహుల్ గాంధీ మాట ఇచ్చారంటే అది చేసి తీరుతారన్న నమ్మకం కలిగించడం మన బాధ్యత. ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్ ను దేశం అనుసరించేలా ఉండాలి. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. రేపు సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నాం. రూ.7 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయి. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తాం. ఆగస్టులో రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తాం. ప్రతీ రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం" - సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ లాగా రైతులను మభ్యపెట్టలేదు

రుణమాఫీ పేరుతో కేసీఆర్ లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడంలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని తెలిపారు. అందుకే ఏకమొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలుచేస్తున్నామన్నారు. మనం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పాలన్నారు. రుణమాఫీపై జాతీయస్థాయిలో చర్చ జరగాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఒకే విడతలో రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేయలేదన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారంటీని అమలు చేశామని పార్లమెంట్ లో ఎంపీలు ప్రస్తావించాలన్నారు. రేపు గ్రామాల్లో, మండల కేంద్రాల నుంచి రైతు వేదికల వరకు బైక్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఎక్కడికక్కడ ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరపాలన్నారు. ఏడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం