CM Revanth Reddy : ఈ నెల 18న రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు, పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ- సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ-hyderabad cm revanth reddy clarified crop loan waiver ration card condition ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : ఈ నెల 18న రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు, పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ- సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

CM Revanth Reddy : ఈ నెల 18న రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు, పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ- సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

Bandaru Satyaprasad HT Telugu
Jul 16, 2024 09:50 PM IST

CM Revanth Reddy On Crop Loan : రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రైతు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన అని స్పష్టం చేశారు.

పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ, రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ, రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

CM Revanth Reddy On Crop Loan : తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల రైతు రుణ మాఫీకి మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కలెక్టర్ల సదస్సులో రుణమాఫీపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి...భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామన్నారు. కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన అని స్పష్టం చేశారు.

ఈ నెల 18న తొలివిడత రుణమాఫీ

ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 18వ తేదీ సాయంత్రం లోగా రైతుల రుణఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయన్నారు. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్దిదారులతో సంబరాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు,ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సూచించారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

90 లక్షల రేషన్ కార్డులు

రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలేనన్నారు. రేషన్ కార్డులు లేని 6.36 లక్షల మందికి రుణాలు ఉన్నాయని, వారికి రుణమాఫీ వర్తిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రేషన్ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు. 18వ తేదీ ఉదయం (గురువారం) 11 గంటలకు కలెక్టర్లు జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రుణమాఫీకి ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని, వ్యక్తిగత, ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దని సూచించాలన్నారు. గతంలో కొందరు బ్యాంకర్లు అలానే చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పుడు అలానే చేస్తామని హెచ్చరించారు. 18వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు రూ.లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకురావాలని, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు రైతులతో ఆ సంతోషాన్ని పంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు జిల్లాలకు (ఉమ్మడి జిల్లాల చొప్పున) ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని, కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు

తెలంగాణ ప్రభుత్వం రూ. 2 లక్షల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసింది. భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ ప్రకటించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు కుటుంబాన్ని గుర్తించేందుకు ప్రామాణికంగా తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది.

  • తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ వర్తిస్తుంది.
  • ఈ పథకం స్వల్ప కాలిక పంట రుణాలకు వర్తిస్తుంది.
  • తెలంగాణలోని షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్ ల నుంచి రైతుల తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
  • 12-12-2018 నుంచి మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 9-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు, వడ్డీ మొత్తం ఈ పథకానికి అర్హత కలిగి ఉంటుంది.
  • ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 09-12-2023 వరకు బకాయి ఉన్న అసలు, వడ్డీ రుణమాఫీ అవుతుంది.
  • రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు పౌర సరఫరాల శాఖ ఆహార భద్రత కార్డు(రేషన్ కార్డు)ను ప్రమాణికంగా తీసుకుంటారు.

పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు వ్యవసాయ శాఖ ఏర్పాటు చేయనుంది. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణఖాతాల్లోనే జమ అవుతాయి. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేయనున్నారు. ఎస్‌హెచ్‌జీ, జేఎల్‌జీ, ఆర్‌ఎంజీ, ఎల్‌ఈసీఎస్‌ రుణాలకు, రీషెడ్యూల్‌ చేసిన రుణాలకు మాత్రం రుణమాఫీ వర్తించదని వ్యవసాయ శాఖ పేర్కొంది. రుణమాఫీపై ఫిర్యాదులు, రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కారించాలని సంబంధిత అధికారులకు ఆదేశించింది. రైతు రుణమాఫీపై మరిన్ని వివరాలకు వెబ్‌ పోర్టల్‌ లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చని వ్యవసాయ శాఖ తెలిపింది.

Whats_app_banner

సంబంధిత కథనం