CM Revanth Reddy : రేషన్ కార్డు లేకపోయినా అందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు - సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య శ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డుకు లింక్ పెట్టొద్దని సూచించారు.
CM Revanth Reddy : రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డుకు లింక్ పెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలన్నారు.
స్థానికంగా స్వచ్ఛంద సంస్థల సహకారం, పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులు తీసుకోవాలని, వ్యాపార వాణిజ్యవేత్తల భాగస్వామ్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ మెరుగుపరిచే విధానాన్ని అవలంబించాలని సూచించారు. అనుభవజ్ఞులైన స్పెషాలిటీ డాక్టర్లను ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించి వైద్య సేవలకు వినియోగించుకోవాలని, మిగతా డాక్టర్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు.
కలెక్టర్లతో సమీక్ష
ప్రజాహితమే ధ్యేయంగా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటూ, అభివృద్ధి-సంక్షేమాలను సమపాళ్లలో కొనసాగిస్తూ 'ఇది ప్రజాప్రభుత్వం' అనే మార్కు ఉండేలా పరిపాలన నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ప్రజాపాలన సహా ఇతర రూపాల్లో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల్లో నిజమైన లబ్దిదారులను గుర్తించి, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ పునర్నిర్మాణం కలెక్టర్ల బాధ్యత
తెలంగాణ పునర్నిర్మాణాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని సీఎం అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం విద్యావ్యవస్థ అత్యంత కీలకమైనదని, విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చూసుకోవాలని కలెక్టర్లకు చెప్పారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుల్లా స్పందించే తీరుగా కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితనం ఉండాలని, ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లాంటి అధికారులు చూపిన ఆదర్శాలను పాటించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. ప్రజాపాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం - సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళాశక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల వంటి అనేక అంశాలపై సీఎం అధికారులతో చర్చిస్తున్నారు.
కలెక్టర్ల సదస్సులో ధరణి సమస్యల పరిష్కారం వివరాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు జియో ట్యాగింగ్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రజలకు లబ్ది చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని సీఎం సూచించారు.
ఆగస్టు 15లోగా ధరణి దరఖాస్తుల పరిష్కరించాలి
పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ‘ధరణి సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి మార్చి 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇప్పటికే ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1,61,760 దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించిందని, కొత్తగా 1,15,308 దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వివరించారు. ధరణిలో దరఖాస్తులను తిరస్కరిస్తే అధికారులు తిరస్కరణకు కారణాన్నికూడా తప్పకుండా నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 15లోగా పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని గడువు నిర్ణయించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులున్నారని, కోటి మందిని సభ్యులుగా చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీరిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం ప్రకటించారు. అయిదేండ్లలో రూ. లక్ష కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పని చేయాలన్నారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు, చేపట్టే వ్యాపారాలకు తమ వినూత్న ఆలోచనలు కూడా జోడించాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని చెప్పారు.
సంబంధిత కథనం