CM Revanth Reddy : మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, గ్లోబల్ సిటీ ప్లానర్లతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు
CM Revanth Reddy : హైదరాబాద్ లో మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు , డిజైనర్లతో దుబాయ్ లో సమావేశాలు నిర్వహించారు.
CM Revanth Reddy : దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం దుబాయ్‌లో బిజీబిజీగా గడిపారు. హైదరాబాద్ లో మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపైనే సీఎం కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. బ్యాక్-టు-బ్యాక్ మీటింగ్ సెషన్‌లలో 56 కిలోమీటర్ల పొడవైన మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ స్పేస్‌లను అభివృద్ధి చేయడం, వాణిజ్య అనుసంధానాలు, పెట్టుబడి నమూనాలపై చర్చించారు. దుబాయ్‌లో 70కి పైగా ప్రపంచ డిజైన్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థలు, కన్సల్టెన్సీలు, నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల్లో యూరప్, మిడిల్ ఈస్ట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టులపై గ్లోబల్ సంస్థలు వివరించాయి. దాదాపుగా అన్ని సంస్థలు తెలంగాణతో ప్రభుత్వంతో భాగస్వామ్యం అవ్వడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. తదుపరి సంప్రదింపుల కోసం ఈ సంస్థల ప్రతినిధులు రాబోయే రోజుల్లో తెలంగాణలో పర్యటించనున్నారు.
ప్రపంచ నగరాలతో పోటీ
చారిత్రాత్మకంగా నగరాలు నీటి వనరుల సమీపంలో అభివృద్ధి చెందాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీని పునరుద్ధరించిన తర్వాత, హైదరాబాద్ కూడా ప్రపంచంలోని అరుదైన నగరంగా నిలుస్తుందన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందస్తు ప్రణాళిక నమూనాలను రూపొందించాలని ఈ సంస్థలను కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భారతీయ నగరాలు, రాష్ట్రాలతో పోటీ పడడం లేదని, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మౌలిక సదుపాయలు మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు దుబాయ్ వాటర్ ఫ్రంట్ ను పరిశీలించారు.
సోమవారం హైదరాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి
సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. సీఎంతో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలితో పాటు పలువురు అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
లండన్ లో పర్యాటక ప్రదేశాలు పరిశీలన
దావోస్ పర్యటన ముగించుకుని లండన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజిబిజీగా గడిపారు. లండన్ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ అక్కడి స్మారక కేంద్రాలను పరిశీలించారు. లండన్‌లో ప్రపంచ ప్రసిద్ధమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రక కట్టడాలను, స్మారక కేంద్రాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. బిగ్‌బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జ్ ఎట్ ఆల్ కట్టడాలను సీఎం, అధికారులతో కలిసి తిలకించారు. ఆర్థికాభివృద్ధిలో పర్యాటక ప్రదేశాల పాత్రను అడిగి తెలుసుకున్నారు.
"లండన్ చారిత్రక వైభవం 1894లో నిర్మించిన టవర్ బ్రిడ్జిని సందర్శించాము. థేమ్స్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి … ఆ పరీవాహకం అక్కడ పర్యటక, వాణిజ్య ప్రాంతంగా వర్ధిల్లుతోంది. హైదరాబాద్ నగరంలో మూసీ సుందరీకరణ పథకం విషయంలో నా విజన్ కు ఇది దగ్గరగా ఉంది. థేమ్స్ నది, దానిపై నిర్మాణాలు, ఆ పరీవాహకంలో వాణిజ్య కార్యకలాపాలను అధికారుల బృందంతో కలిసి అధ్యయనం చేశాము"-సీఎం రేవంత్ రెడ్డి