CM Revanth Review : ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయండి - సీఎం రేవంత్ ఆదేశాలు
19 February 2024, 18:54 IST
- Musi River Front Development Project Updates: మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హెచ్ఎండీఏ అధికారులతో సమీక్షించిన ఆయన.. పలు అంశాలపై సూచనలు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
CM Revanth reddy Review On Musi River Front: మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకు ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను(Hyderabad Musi River) పూర్తి చేయాలన్నారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అధికారులకు పని విభజన చేసి… మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
Hyderabad Musi River Rejuvenation : మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే లండన్ లో పర్యటించారు. లండన్ లోని థేమ్స్ నదిని సందర్శించారు. థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరును, అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, ఫోర్డ్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కెహల్ లివీ సీఎంకు వివరించారు. అందులో భాగంగా ఎదురైన సవాళ్లు, పరిష్కారాలు, ఖర్చయిన నిధులు, భాగస్వామ్యమైన సంస్థలు, అందంగా తీర్చిదిద్దేందుకు అనుసరించిన అత్యుత్తమ విధానాలన్నీ ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్… చారిత్రాత్మకంగా నగరాలు నీటి వనరుల సమీపంలో అభివృద్ధి చెందాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మౌలిక సదుపాయలు మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా… మూసీ రివర్ అభివృద్ధి కోసం రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. ముందుగా మూసీ నదిలోని మురికిని శుద్ధి చేసిన తర్వాత…. అభివృద్ధి పనులను చేపట్టేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో… ఈ ప్రక్రియకు త్వరలోనే ముహుర్తం ఖరారయ్యే అవకాశం ఉంది.
సీఎంను కలిసిన చిన్నజీయర్ స్వామి…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి కలిశారు. ముచింతల్లో 20వ తేదీ నుండి 3మార్చి వరకు భగవద్ రామానుజుల "సమతా కుంభ్-2024" నిర్వహించనున్నారు. ఈ మహోత్సవానికి రావలసిందిగా ఆహ్వానించారు.సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి పుష్పగుచ్చాం అందించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చిన్నజీయర్ స్వామి కలవటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా కాసేపు ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుకున్నట్లు తెలిసింది.