Musi River Bridges : ఈసీ, మూసీ నదులపై 5 వంతెనలు నిర్మాణం- రేపు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
Musi River Bridges : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. 55 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఈసీ, మూసీ నదిపై 5 వంతెనలు నిర్మించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Musi River Bridges : హైదరాబాద్ లో సుమారు 55 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ, మూసీ నదులపై నార్సింగి నుంచి గౌరెల్లి వరకు అయిదు కొత్త వంతెనలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో మూసీ నదిపై 4 లేన్లతో సుమారు 168 కోట్ల రూపాయల వ్యయంతో 5 వంతెనలను 15 నెలల లోపు నిర్మించాలని యోచిస్తోంది. ఈసీ నదిపై బుద్వేల్ ఐటీ పార్క్ వద్ద రెండు వంతెనలు, మూసీ నదిపై మంచిరేవుల వద్ద మూడో వంతెన, మూసీ నదిపై హెచ్ఎండీఏ లేఅవుట్ ఉప్పల్ భగాయత్ వద్ద నాలుగో వంతెన, ప్రతాప సింగారం వద్ద అయిదో వంతెన నిర్మించనున్నారు. మంత్రి కేటీఆర్ సెప్టెంబర్ 25న ఉప్పల్ భగాయత్ వద్ద అయిదు వంతెనలకు శంకుస్థాపన చేయనున్నారు.
మూసీ, ఈసీ నదులపై హెచ్‌ఎండీఏ నిర్మించే 5 బ్రిడ్జిలు
- ఈసీ నదిపై రాజేంద్రనగర్-బుద్వేల్ ఐటీ పార్కు వద్ద వంతెన (180 మీటర్ల పొడవు, 4 లేన్లు, రూ.19.83 కోట్ల వ్యయం)
- ఈసీ నదిపై రాజేంద్రనగర్-బుద్వేల్ ఐటీ పార్కు వద్ద వంతెన (196 మీటర్ల పొడవు, 4 లేన్లు, రూ. 20.64 కోట్ల వ్యయం)
- మూసీ నదిపై మంచిరేవుల వద్ద హైలెవల్ బ్రిడ్జి (180 మీటర్ల పొడవు, 4 లేన్లు, రూ.32.21 కోట్ల వ్యయం)
- ఉప్పల్ భగాయత్ లేఅవుట్ వద్ద బ్రిడ్జి ( 210 మీటర్ల పొడవు, 4 లేన్లు, రూ.29.28 కోట్ల వ్యయం)
- ప్రతాప సింగారం వద్ద బ్రిడ్జి (210 మీటర్ల పొడవు, 4 లేన్లు, రూ. 26.94 కోట్ల వ్యయం)
మొత్తం 14 వంతెనలు
మూసీ, ఈసీ నదులపై నిర్మిస్తున్న 14 వంతెనల్లో 5 బ్రిడ్జిలను హెచ్‌ఎండీఏ నిర్మిస్తుంది. మిగతా 9 వంతెనలను జీహెచ్‌ఎంసీ నిర్మిస్తుంది. హెచ్‌ఎండీఏ నిర్మిస్తున్న 5 వంతెనలకు ఇటీవల టెండర్లను ఆహ్వానించారు అధికారులు. మంచిరేవుల, బుద్వేల్ ఐటీ పార్కు-1, బుద్వేల్ ఐటీ పార్కు-2, పత్రాప సింగారం, ఉప్పల్ భగాయత్ లేఅవుట్ ప్రాంతాల్లో ఈ ఐదు వంతెనలు నిర్మించనున్నారు. కొత్తగా నిర్మించే బ్రిడ్జిలు ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించిన పలు డిజైన్ లను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో వంతెనల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ రేపు శ్రీకారం చుట్టనున్నారు.