తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress Indravelli Sabha : 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన - ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్

Congress Indravelli Sabha : 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన - ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్

02 February 2024, 18:08 IST

google News
    • Telangana Congress Punarnirmana Sabha : బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి సభలో మాట్లాడిన ఆయన… వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.  15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తామన్నారు.
ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి
ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి

ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి

Telangana Congress Punarnirmana Sabha at Indravelli : ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తెలంగాణ పునర్నిర్మాణ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాట ఇచ్చిన ప్రకారం ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకుంటామన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ విధ్వంసానికి గురైందన్నారు. నాగోబా ఆలయాన్ని గత ప్రభుత్వం ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే 7 వేల స్టాఫ్‌ నర్సుల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తామని… దీనిపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి 60 రోజులు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే 6 గ్యారంటీలు పూర్తి కాలేదని కొందరు అడుగుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం కనీసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఆలోచన చేసిందా? అని ప్రశ్నించారు. త్వరలోనే లక్ష మంది మహిళలకు రూ.500లకు సిలిండర్‌ అందజేస్తామని.. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్ స్కీమ్ ను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఉచిత విద్యుత్ ను అందిస్తామని చెప్పారు.

కోటి ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. నీళ్లు ఎక్కడిచ్చారో చూపించాలని నిలదీశారు. “మన ప్రభుత్వం పడిపోతుందని కొందరు అంటున్నారు. అలా చేస్తే మనం ఊరుకుంటామా…? కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అంటే పళ్లు రాళ్లుతాయి. మా ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటే తొక్కుకుంటా వెళ్తాం. మళ్లీ జన్మలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా కాలేరు. అన్నివర్గాలను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. అందర్నీ నిలువునా దోపిడీ చేశారు. ఆరు నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలు వస్తాయని అంటున్నారు. 8 సీట్లు వస్తే మోదికి అమ్ముకుంటావా…? గతంలో కూడా అలాగే చేశారు. కేసీఆర్ ను కాంగ్రెస్ కూటమిలోకి రానివ్వం. ఈ దేశంలో ఉన్నవి రెండే కూటమిలే. ఒకటి మోదీ, మరోకటి కాంగ్రెస్ కూటమి మాత్రమే. ఉద్యోగాలు ఇస్తామని, రైతుల ఆదాయాన్ని పెంచుతామని, ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని చెప్పి మోదీ మోసం చేశారు. ఎంపీగా గెలిచిన సోయంబాపురావుకు కనీసం మంత్రి పదవి ఇచ్చారా…?అలాంటి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. వచ్చే ఎన్నికల్లో మోదీ, కేడీకి బుద్ధి చెప్పాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే ఆదిలాబాద్ గడ్డపై నుంచి శంఖారావం పూరించి కేసీఆర్ పడగొట్టామని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ఈసారి కూడా ఇదే గడ్డపై పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరిస్తున్నామని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తదుపరి వ్యాసం