Adilabad News : రేవంత్ రెడ్డి టీంలో ఆదిలాబాద్ నుంచి చోటు దక్కేదెవరికి?
Adilabad News : ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఇద్దరికీ కేబినెట్ లో అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
Adilabad News : ఉమ్మడి ఆదిలాబాద్ లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఇద్దరికీ మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ లో పది నియోజకవర్గాలు ఉండగా నాలుగు స్థానాల్లోఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. తూర్పు మంచిర్యాల జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుపరిచితులైన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నుంచి గెలుపొందారు. ఇదే జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్ నియోజవర్గాల ద్వారా గడ్డం వెంకటస్వామి తనయులు గడ్డం వినోద్, గడ్డం వివేక్ గెలుపొందారు. ఖానాపూర్ నుంచి ఆదివాసి తెగకు చెందిన వెడమ బొజ్జు పటేల్ గెలుపొందారు. గెలుపొందిన నలుగురిలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉన్నందున ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
వీరి బలబలాలు
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదిలాబాద్ జిల్లాలో చక్రం తిప్పిన నేతగా పేరుంది. మంచిర్యాల జిల్లా ధర్మరావుపేటకు చెందిన ప్రేమ్ సాగర్ రావు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈయన 1985లో లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ గా, 2004 2009లో కాసిపేట ఎంపీపీగా, 1999 నుంచి 2002 వరకు పీసీసీ మెంబర్ గా పని చేశారు. 2002లో పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, 2004 నుంచి 26 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా కొనసాగారు. సమంత 2005 నుంచి 2007 వరకు హైదరాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా పనిచేశారు. అనంతరం 2007 నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. ఏఐసీసీ మెంబర్ గా కొనసాగుతున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్న నేతగా ప్రజల్లో చిరస్థాయిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తనవంతుగా జిల్లాలో మిగతా ఎమ్మెల్యేలను గెలిపించేందుకు విశేష కృషి చేశారు.
ఇలా ఉండగా బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వినోద్ తండ్రి వెంకటస్వామి వారసత్వ రాజకీయం పొందిన ఈయన 1999లో చెన్నూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో సైతం తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. వైఎస్సార్ హయాంలో 2004-2009 రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2010లో జరిగిన తెలంగాణ ఉద్యమం ఎన్నికల సమయంలో ఓడిపోయారు. ఉద్యమం ప్రతాక స్థాయికి చేరడంతో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు, సరైన గుర్తింపు లేకపోవడంతో 2014లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
2016లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీలో చేరి 2018లో టికెట్ దక్కకపోవడంతో బెల్లంపల్లి నుంచి బీఎస్పీ పార్టీ ద్వారా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన తమ్ముడు గడ్డం వివేక్ ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరి చెన్నూరు నియోజవర్గంలో పోటీ చేసి గెలుపొందారు. పార్టీలో చేరేముంది తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఉమ్మడి ఆదిలాబాద్ లో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలూ ఒక్కో సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం.
రిపోర్టింగ్: కామోజీ వేణుగోపాల్ ఉమ్మడి ఆదిలాబాద్