CM Revanth Reddy : అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమం, కొత్త ఏడాదిలో మిగిలిన గ్యారంటీలు అమలు- సీఎం రేవంత్ రెడ్డి-hyderabad news in telugu cm revanth reddy new year wishes to telangana people assured implementation of six guarantees ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమం, కొత్త ఏడాదిలో మిగిలిన గ్యారంటీలు అమలు- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమం, కొత్త ఏడాదిలో మిగిలిన గ్యారంటీలు అమలు- సీఎం రేవంత్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Jan 01, 2024 03:38 PM IST

CM Revanth Reddy : తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త ఏడాదిలో మిగిలిన గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. లేఖ రూపంలో సీఎం రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. ఈ నూతన సంవత్సరం రైతు, మహిళా, యువత నామ సంవత్సరంగా నామకరణం చేస్తున్నామన్నారు. తెలంగాణలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కొత్త ఏడాదిలో గ్యారంటీల అమలుకు ప్రభుత్వం సిద్ధం

" మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్బంధాలు, ఇనుప కంచెలు తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వామ్యులను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం. 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేశాం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారంటీల అమలుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమం అందాలి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలన్నదే మన ప్రభుత్వ ఆకాంక్ష. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నాం. గత పాలనలో స్తంభించిపోయిన పాలన వ్యవస్థ సమూల ప్రక్షాళన సంకల్పించాం. ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునరుద్ధరణ జరుగుతుంది. ప్రజల గోడు వినేందుకు ప్రజా భవాన్ లో ప్రజా వాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కార్యనిర్వహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నాం"- సీఎం రేవంత్ రెడ్డి

త్వరలో సాగునీటి రంగంలో అవినీతిపై శ్వేత పత్రం

"గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పురపుష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, విద్యుత్ రంగాలలో వాస్తవ పరిస్థితులను శ్వేతపత్రం ద్వారా మీ ముందు ఉంచాం. త్వరలోనే సాగునీటి రంగంలో జరిగిన అవినీతిపై కూడా శ్వేత పత్రం విడుదల చేస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దోపిడీకి గురైన తెలంగాణ ప్రజల సంపదను తిరిగి రాబడతామని మాట ఇచ్చాం. ఆ దిశగా చర్యలు మొదలు పెడతాం" - సీఎం రేవంత్ రెడ్డి

త్వరలో ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం

"అమరులు, ఉద్యమకారులు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులపై నమోదు అయిన కేసుల వివరాలు సేకరిస్తున్నాం. ఆ కేసుల నుంచి విముక్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తుద్ధితో ఉంది. ఆటో కార్మికులు, అసంఘిటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చాం. జర్నలిస్టుల సంక్షేమం పట్ల మన ప్రభుత్వం చిత్తశద్ధితో ఉంది. త్వరలో వాళ్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. తెలంగాణలో ప్రతీ గడపన సౌభాగ్యం వెల్లి విరియాలని...ప్రతీ ఇంట వెలుగులు నిండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner