TSLPRB Constable Recruitment: కానిస్టేబుల్‌ నియామక పరీక్షల్లో ఆ ప్రశ్నలు తొలగించాలని తేల్చిన తెలంగాణ హైకోర్టు-the telangana high court has ordered to remove those questions from constable recruitment exams ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tslprb Constable Recruitment: కానిస్టేబుల్‌ నియామక పరీక్షల్లో ఆ ప్రశ్నలు తొలగించాలని తేల్చిన తెలంగాణ హైకోర్టు

TSLPRB Constable Recruitment: కానిస్టేబుల్‌ నియామక పరీక్షల్లో ఆ ప్రశ్నలు తొలగించాలని తేల్చిన తెలంగాణ హైకోర్టు

HT Telugu Desk HT Telugu
Oct 10, 2023 01:26 PM IST

TSLPRB Constable Recruitment: తెలంగాణ కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో అభ్యంతరాలు లేవనెత్తిన నాలుగు ప్రశ్నల్ని తొలగించి మూల్యాకనం చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలిని హైకోర్టు ఆదేశించింది.

టీఎస్ హైకోర్టు
టీఎస్ హైకోర్టు

TSLPRB Constable Recruitment: తెలంగాణ కానిస్టేబుల్ నియామక పరీక్షలపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో అభ్యర్థులు అభ్యంతరం తెలిపిన నాలుగు ప్రశ్నల్ని తొలగించి తిరిగి మూల్యాకనం చేయాలని ఆదేశించింది.

తెలంగాణలో సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. అభ్యర్థులు సందేహాలు లేవనెత్తిన నాలుగు ప్రశ్నలను మూల్యాంకనం నుంచి తొలగించాక జవాబు పత్రాలను రీ వాల్యుయేషన్‌ చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని తీర్పునిచ్చింది. ఆ తర్వాతే కానిస్టేబుల్ నియామక ప్రక్రియను కొనసాగించాలంటూ సోమవారం తీర్పును వెలువరించింది.

తెలంగాణ వ్యాప్తంగా 4,965 సివిల్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి గత ఏడాది ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత రాత పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు 5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

కానిస్టేబుల్ నియామకాల కోసం నిర్వహించిన పరీక్షా ప్రశ్నపత్రంలో ప్రశ్నలను తెలుగులోకి అనువాదించ లేదని, మరికొన్ని ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని, వాటిని తొలగించాలంటూ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలికి వినతిపత్రం ఇచ్చినా పట్టించు కోకపోవడంతో పలువురు అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా 6 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ పి.మాధవీదేవి విచారణ జరిపారు.

పరీక్షల్లో అడిగిన ప్రశ్నలకు తెలుగులో అనువాదం ఉన్నా ఇవ్వలేదని పిటిషనర్ల న్యాయవాది వివరించారు. అభ్యర్థులకు ఆంగ్లం అర్థం కాక ఆ ప్రశ్నలను వదిలేయాల్సి వచ్చిందని, కొన్ని ప్రశ్నలు తప్పుగా వచ్చాయని పేర్కొన్నారు.

ఒక ప్రశ్నలో పారాదీప్‌ పోర్టు అథారిటీకి బదులు ప్రదీప్‌ పోర్టు అథారిటీ అని ఇచ్చారని ఈమేరకు నిపుణుల కమిటీని ఏర్పాటుచేయాలని, వారు అధ్యయనం చేసి దానిపై తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నియామకాలు చేపట్టాలని కోరారు. ఆ ప్రశ్నలను తొలగించకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

మనీష్‌ ఉజ్వల్‌ వర్సెస్‌ మహర్షి దయానంద్‌ సరస్వతి యూనివర్సిటీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తప్పుగా ఇచ్చిన ప్రశ్నలను తొలగించి మూల్యాంకనం చేసేలా ఆదేశించాలని కోరారు. ఆ ప్రశ్నలకు ఇచ్చిన ఐచ్ఛికాలు వాడుకలో ఉన్న ఆంగ్ల పదాలేనని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. అందరూ వాటినే ప్రముఖంగా వాడుతున్నారని, ఒక అక్షరం అచ్చుతప్పు, పెద్ద తప్పేమీ కాదన్నారు.

ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వెలువరిస్తూ ప్రశ్నపత్రంలోని 122, 130, 144 ప్రశ్నలను తొలగించాలని ఆదేశించారు. ప్రశ్నపత్రం రూపకల్పనలో పోలీస్ నియామక మండలి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. తెలుగు అనువాదం లేని 3 ప్రశ్నలను, తప్పుగా ఉన్న ప్రశ్నను తొలగించాలంటూ పోలీసు నియామక మండలిని ఆదేశించారు. పిటిషన్లను అనుమతిస్తూ తీర్పును వెలువరించారు.

Whats_app_banner