CM Revanth in Assembly : కృష్ణా జలాల దోపిడీకి మీరే కారణం - ఆ రోజు సంతకాలు పెట్టిందెవరు..? BRSపై సీఎం రేవంత్ ఫైర్
09 February 2024, 17:26 IST
- Telangana Assembly Sessions 2024: ప్రతిపక్ష బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం… కృష్ణా జలాలపై కేసీఆర్ నల్గొండలో సభ పెట్టడం కాదని.. దమ్ముంటే ఢిల్లీలో దీక్షకు దిగాలని సవాల్ విసిరారు.
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
Telangana Assembly Sessions 2024: కాళేశ్వరంలోని లోపాలు చర్చకు వస్తుంటే… బీఆర్ఎస్ నేతలు కృష్ణా ప్రాజెక్టుల అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మండిపడ్డారు. పక్క రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి భోజనాలు చేసి… తెలంగాణ ప్రాజెక్టులను విస్మరించింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతానికి బీఆర్ఎస్ పాలనలో తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి ఏపీలో కూడా ఈ తరహా అన్యాయం జరగలేదని చెప్పారు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో తాము చేస్తున్న పోరాాటానికి బీఆర్ఎస్ నేతలు మద్దతు ఇవ్వాలి కానీ… కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని దుయ్యబట్టారు. లేనిపోని ఆరోపణలతో రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించారు. కృష్ణా ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పార్టీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ ప్రసంగం:
- నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యేలు కలవొచ్చు. ఎవరు వచ్చినా సమయం ఇచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తాను. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవటానికి వస్తే ఆ పార్టీ పెద్దలు అనుమానిస్తున్నారు.
- వినతిపత్రాలు తీసుకువచ్చే ఏ ఎమ్మెల్యేనైనా కలుస్తాం.
- పెన్షన్లు పడటం లేదని పలువురు అంటున్నారు. కానీ 80 శాతం మందికి పెన్షన్లు ఇచ్చాం. ఈ నెలఖారులోపు మిగతావారికి కూడా పంపిణీ చేస్తాం. గతంలో జరిగినట్లు ఇప్పుడు జరగదు. వాస్తవాలను మాత్రమే చెబుతాం.
- రైతుబంధు నిధుల జమ కూడా త్వరలోనే పూర్తి అవుతుంది.
- వరంగల్ లోని కాళోజీ క్షేత్రాన్ని పూర్తి చేస్తాం.
- కృష్ణా ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తోంది. కాళేశ్వరం గురించి మాట్లాడితే చాలు... కృష్ణా ప్రాజెక్టులను తెరపైకి తీసుకువచ్చి చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. అధికారంలో ఉన్న ఏ ఒక్కరోజు మాట్లాడని బీఆర్ఎస్ నేతలు... ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు..?
- ప్రాజెక్టులను మోదీ గుంజుకుంటున్నారు. అలాంటప్పుడు కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ ఢిల్లీలో దీక్ష చేయవచ్చు కదా... ?
- ఎన్నికల పోలింగ్ రోజు కూడా సాగర్ ప్రాజెక్ట్ పై కుట్ర చేశారు. ఏపీ పోలీసులు ఆ రోజు ఎలా వచ్చారు..? ఇంటి దొంగల మద్దతు లేకుండా వాళ్లు వస్తారా...?
-ఇదే కేసీఆర్ ఏపీ మంత్రి రోజా ఇంటికెళ్లి వెళ్లి రాగిముద్దలు తినలేదా..? ప్రగతి భవన్ లో జగన్మోహన్ రెడ్డితో కలిసి భోజనాలు చేయలేదా..? మీ తీరు వల్లే కదా ఏపీ సర్కార్ జల దోపిడీకి దిగింది.
-కృష్ణా జలాల వాటా కేటాయింపు పత్రాలపై బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అధికారులు సంతకాలు చేయలేదా…? ఇదే విషయంపై ఎంపీ నామానాగేశ్వరరావు పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు కూడా కేంద్రం స్పష్టమైన జవాబునిచ్చింది. వీటిపై బీఆర్ఎస్ నేతలు ఏం సమాధానం చెబుతారు..?
-తెలంగాణ జల హక్కులను ఏపీకి కట్టబెట్టిన బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటుగా ఉంది.
-జయశంకర్ పుట్టిన గ్రామాన్ని కూడా రెవెన్యూ విలేజ్ గా మార్చిన ఘనత మా ప్రభుత్వానిది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఈ విషయాన్ని కూడా పట్టించుకోలేదు.
-అతిగొప్ప మేథావిగా చెప్పుకునే కేసీఆర్ కనీసం అసెంబ్లీకి కూడా రావటం లేదు. మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సూచనలు చేస్తారని అనుకున్నాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావకపోవటం దురదృష్టకరం.
-ఉద్యోగస్తులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని స్థితి నుండి ఒకటో తారీకున జీతాలు ఇచ్చే పాలన మా ప్రజా ప్రభుత్వంది. సరైన పాలన, విధి విధానాలు తెలిసిన నాయకుడి చేతిల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఉంది.
-గ్రూప్ 1 అప్లికేషన్ వయోపరిమితి 46కు పెంచుతాం.
-ఆటో డ్రైవర్లు బాగానే ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్లే ఆటో తీసుకొచ్చి తగలబెట్టారు. ఇబ్బందుల్లో ఉంటే ఎవరైనా తగలబెడుతారా..?
-తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయబోతున్నాం.
- టీఎస్ పేరు టీజీగా మారుతుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.