తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr On Krishna Projects : కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం, తెలంగాణకు మళ్లీ కరవు ప్రమాదం- కేసీఆర్

KCR On Krishna Projects : కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం, తెలంగాణకు మళ్లీ కరవు ప్రమాదం- కేసీఆర్

06 February 2024, 19:15 IST

google News
    • KCR On Krishna Projects : కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేక ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తుందని ఆరోపించారు.
కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనంతో తీవ్ర నష్టం- కేసీఆర్
కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనంతో తీవ్ర నష్టం- కేసీఆర్

కృష్ణా ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనంతో తీవ్ర నష్టం- కేసీఆర్

KCR On Krishna Projects : సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే అడుక్కునే పరిస్థితులు వస్తుందన్నారు. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకునేదేలేదని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలకులకు అవగాహన లేక ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తామంటున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. మంగళవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం

ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ...తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తున్నామన్నారు. కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంత వరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా నల్గొండలో సభ నిర్వహిస్తామన్నారు. నాడు ఉద్యమం చేసి తెలంగాణను సాధించి హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమ కారులదేనని కేసీఆర్ అన్నారు.

దక్షిణ తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేసీఆర్ అన్నారు. కేఆర్ఎంబీకి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

కేంద్రం ఎత్తుగడ

తెలంగాణ ఉద్యమంలో సాగునీరు, తాగునీటి హక్కుల కోసం పోరాడడమే కాకుండా “మా నీళ్లు మాకే “ అనే ప్రజా నినాదాన్ని స్వయంపాలన ప్రారంభమైన తక్కువ కాలంలోనే నిజం చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేసీఆర్ స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ పేరుతో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకున్న హక్కులను కైవసం చేసుకునేందుకు కేంద్రం వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కేంద్రం ఒత్తిళ్లను తట్టుకుంటూ పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసి కాపాడిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు, తాగునీరు అందక తిరిగి కరవుకోరల్లో చిక్కుకునే ప్రమాదం పొంచివున్నదని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాదకర వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాల్లో తెలంగాణకు రావలసిన వాటాను హక్కులను నూటికి నూరుశాతం కాపాడేందుకు ఎంతదాకనైనా పోరాడాల్సిందేనని కేసీఆర్ అన్నారు.

తదుపరి వ్యాసం