CBI case against Megha Engineering: అవినీతి ఆరోపణలతో మేఘా ఇంజనీరింగ్ పై సీబీఐ కేసు నమోదు
13 April 2024, 19:33 IST
- CBI case against Megha Engineering: అవినీతి ఆరోపణలపై హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పై సెంట్రల్ బ్యూరొ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. మేఘా ఇంజనీరింగ్ తో పాటు ఎన్ఎండీసీ అధికారులపై కూడా కేసు నమోదు చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
CBI case against Megha Engineering: హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (Megha Engineering and Infrastructure Ltd - MEIL) రూ.315 కోట్ల ఎన్ఐఎస్పీ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది. జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన పనుల్లో మేఘా ఇంజనీరింగ్ కు చెందిన రూ.174 కోట్ల బిల్లుల క్లియరెన్స్ లో సుమారు రూ.78 లక్షలు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై ఎన్ఐఎస్పీ (NISP), ఎన్ఎండీసీ (NMDC) కి చెందిన 8 మంది అధికారులు, మెకాన్ (MECON) కు చెందిన ఇద్దరు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలులో మేఘా ఇంజనీరింగ్ సంస్థ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
జగదల్ పూర్ ప్లాంట్ పనుల్లో అవినీతి
జగదల్ పూర్ లోని ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ లో మేఘా ఇంజనీరింగ్ (Megha Engineering)సంస్థ చేపట్టిన ఇన్ టేక్ వెల్, పంప్ హౌస్, క్రాస్ కంట్రీ పైప్ లైన్ పనులకు సంబంధించి రూ.315 కోట్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ 2023 ఆగస్టు 10న ప్రాథమిక విచారణ జరిపింది. ప్రాథమిక విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా మార్చి 31న రెగ్యులర్ కేసు నమోదు చేయాలని సిఫారసు చేశారు.
వీరిపైనే కేసు
ఎన్ఐఎస్పీ (NISP), ఎన్ఎండీసీ (NMDC) కి చెందిన 8 మంది అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. వారిలో రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ దాష్, డైరెక్టర్ (ప్రొడక్షన్) డీకే మొహంతి, డీజీఎం పీకే భుయాన్, డీఎం నరేష్ బాబు, సీనియర్ మేనేజర్ సుబ్రో బెనర్జీ, రిటైర్డ్ సీజీఎం (ఫైనాన్స్) ఎల్ కృష్ణమోహన్, జీఎం (ఫైనాన్స్) కె.రాజశేఖర్, మేనేజర్ (ఫైనాన్స్) సోమనాథ్ ఘోష్ ఉన్నారు. వీరు రూ.73.85 లక్షలు లంచం తీసుకున్నట్లు ఎఫ్ఐఆర్ లో సీబీఐ పేర్కొంది. అలాగే,రూ. 5 లక్షల మేర లంచం తీసుకున్నట్లుగా మెకాన్ లిమిటెడ్ ఏజీఎం (కాంట్రాక్ట్స్) సంజీవ్ సహాయ్, డీజీఎం (కాంట్రాక్ట్స్) కె.ఇలవర్సు పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు.
బీజేపీకి రూ.586 కోట్లు విరాళం
ఎన్నికల కమిషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) ను కొనుగోలు చేసిన రెండో అతిపెద్ద సంస్థగా మేఘా ఇంజనీరింగ్ నిలిచింది. ఈ సంస్థ బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రూ. 586 కోట్లను విరాళంగా ఇచ్చింది. అలాగే, బీఆర్ఎస్ కు రూ.195 కోట్లు, డీఎంకేకు రూ.85 కోట్లు విరాళంగా ఇచ్చింది. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, జేడీఎస్, జనసేన పార్టీ, జేడీయూలకు రూ.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు విరాళాలు ఇచ్చింది.