Electoral bonds: వ్యక్తిగతంగా ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసినవారిలో టాప్ 10 వీరే; ఇందులో 84 శాతం బీజేపీకే..
Electoral bonds:సంస్థలు కాకుండా, వ్యక్తిగతంగా అత్యధిక మొత్తంలో ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన వారిలో తొలి స్థానంలో ఆర్సెలర్ మిట్టల్ ఛైర్ పర్సన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ నిలిచారు. ఆయన రూ.35 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసి, అవన్నీ బీజేపీకే విరాళంగా ఇచ్చారు.
ఏప్రిల్ 12, 2019 నుంచి జనవరి 11, 2024 మధ్య వ్యక్తిగతంగా అత్యధిక మొత్తంలో ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన టాప్ 10 మంది వ్యాపారవేత్తలు రూ .180.2 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశారు. ఇందులో రూ .152.2 కోట్లు లేదా 84.5% భారతీయ జనతా పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు ఎన్నికల కమిషన్ గురువారం విడుదల చేసిన తాజా డేటాలో తెలిపింది.
మూడో స్థానంలో బీఆర్ఎస్
తృణమూల్ కాంగ్రెస్ (TMC) రూ.16.2 కోట్లు (9 శాతం) దక్కించుకుని రెండో స్థానం సాధించింది. రూ.5 కోట్ల విరాళాలు పొంది భారత రాష్ట్ర సమితి (BRS) మూడో స్థానంలో నిలిచింది. ఆర్సెలర్ మిట్టల్ ఛైర్ పర్సన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ రూ.35 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసి, అవన్నీ బీజేపీకి విరాళంగా ఇచ్చారు.
రిలయన్స్ గ్రూప్
లక్ష్మీ దాస్ వల్లభదాస్ మర్చంట్ 2023 నవంబర్లో తన రూ.25 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ (electoral bonds) ను బీజేపీకి విరాళంగా ఇచ్చారు. అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో లక్ష్మీ దాస్ వల్లభదాస్ మర్చంట్ గ్రూప్ కంట్రోలర్ గా ఉన్నారు. గత 33 సంవత్సరాలుగా ఆయన రిలయన్స్ గ్రూప్ లో ఉన్నారు. మిట్టల్, మర్చంట్, కేఆర్ రాజా జేటీ, ఇందర్ ఠాకూర్ దాస్ జైసింఘానీ, రాహుల్ జగన్నాథ్ జోషి, ఆయన కుమారుడు హర్మేష్ రాహుల్ జోషి, రాజు కుమార్ శర్మ, సౌరభ్ గుప్తా, అనితా హేమంత్ షా బీజేపీకి మాత్రమే విరాళాలు ఇచ్చారు.
అన్ని పార్టీలకు న్యాయం
దేశంలోనే అతిపెద్ద వైర్లు, కేబుల్స్ తయారీ సంస్థ పాలీక్యాబ్ ఇండియా చైర్ పర్సన్, ఎండీ గా జైసింఘాని వ్యవహరిస్తున్నారు. రాహుల్ జగన్నాథ్ జోషి, హర్మేష్ రాహుల్ జోషి తండ్రీకొడుకులు. వీరిద్దరు పలు ప్రముఖ ఫ్రీట్ కంపెనీ బోర్డుల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ఇండిగో ఎంపీ రాహుల్ భాటియా టీఎంసీకి రూ.16.2 కోట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి రూ.3.8 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇండిగో, సంబంధిత సంస్థలు 2019 మేలో బీజేపీకి రూ. 31 కోట్లు, 2023 ఏప్రిల్లో కాంగ్రెస్ కు రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చాయి. అజంతా ఫార్మా సీఈఓ రాజేశ్ మన్నాలాల్ అగర్వాల్ బీజేపీకి రూ.5 కోట్లు, బీఆర్ఎస్ కు రూ.5 కోట్లు, కాంగ్రెస్ కు రూ.3 కోట్లు విరాళంగా ఇచ్చారు. అజంతా ఫార్మా బీజేపీకి రూ.3 కోట్లు, కాంగ్రెస్ కు రూ. 1 కోటి విరాళంగా ఇచ్చింది.
బయోకాన్ కూడా..
మరో ముఖ్యమైన వ్యక్తిగత దాత, బయోకాన్ కు చెందిన కిరణ్ మజుందార్ షా వ్యక్తిగత దాతల జాబితాలో 12 వ స్థానంలో ఉన్నారు. ఆమె ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి రూ .4 కోట్లు, జనతాదళ్ (సెక్యులర్) కు రూ. 1 కోటి, కాంగ్రెస్ కు రూ .1 కోటి విరాళం ఇచ్చారు.