CM Revanth Reddy : ఆడబిడ్డల పేరుతోనే పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
11 March 2024, 16:59 IST
- CM Revanth Reddy : భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గృహ నిర్మాణ పథకాన్ని ఆడ బిడ్డల పేరుతోనే ఇస్తున్నామని చెప్పారు. 22 వేల 500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : రాష్ట్రంలో 22 వేల 500 కోట్ల బడ్జెట్ తో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)స్పష్టం చేశారు. సోమవారం భద్రాచలంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి తొలుత సీతారామచంద్రస్వామిని దర్శించుకుని అనంతరం అక్కడి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుందని, అందుకే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గృహ నిర్మాణ పథకాన్ని ఆడ బిడ్డల పేరుతోనే ఇస్తున్నామని చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ పదేళ్ల పాటు ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. బిడ్డ, అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటారు అంటూ కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశాడని విమర్శించారు. చెప్పిన మాటలను మళ్లీ మళ్లీ చెబుతూ సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పబ్బం గడుపుకున్నారని విమర్శించారు. అందుకే మోసపోయామని గ్రహించిన రాష్ట్ర ప్రజలు మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ను బీఆర్ఎస్ ను బొంద పెట్టారన్నారు.
ఖమ్మం ప్రజలు కేసీఆర్ ని మొదట్నుంచీ నమ్మలే
2014, 2018, 2023 లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం(Khammam) నుంచి ఒకే ఒక అభ్యర్థిని మాత్రమే కేసీఆర్ పార్టీ గెలుచుకుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అంటే మొదటి నుంచి ఖమ్మం జిల్లా ప్రజలు కేసీఆర్ ను నమ్మలేదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. అందుకే ఈ జిల్లా నుంచి బృహత్తరమైన ఇందిరమ్మ ఇంటి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 92 రోజులు మాత్రమే గడిచిందని, ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల్లోనే ఆడ బిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల ఉచిత వైద్యాన్ని అందజేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ పాలనలో రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ను రూ. 1200 చేశారని రూ.50 ఉన్న పెట్రోల్ ను రూ.110కి పెంచారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయానికే కాకుండా ఇంటికి కూడా ఉచిత విద్యుత్ (Free Power)ను అందజేస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డలు రూపాయి రూపాయి పోగేసి కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని సీఎం పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం(KCR Govt) ఏ ఊర్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు(Double Bed Rooms) ఇచ్చిందో అక్కడే ఓట్లు వేయించుకోవాలని.. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినచోట మేము ఓట్లు వేయించుకుంటామని సీఎం రేవంత్.. కేసీఆర్ కు సవాల్ విసిరారు.
మోదీవి మంచి బట్టలు.. తియ్యటి మాటలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మంచి మంచి బట్టలు వేసుకొని తియ్యని మాటలు చెబుతారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విమర్శించారు. పీఎం ఆవాస్ యోజన(PM Awas Yojana) కింద 2022 నాటికి దేశంలో అందరికీ ఇళ్లు కట్టిస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్పిందని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎన్ని ఇళ్లు కట్టారో చూపించాలని సవాల్ విసిరారు. అన్నం పెట్టే రైతులను (Delhi Farmers Protest)దిల్లీలో తూటాలతో బలి తీసుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఇక ప్రజలు నమ్మరని విమర్శించారు. ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని ప్రకటించిన మోదీ 15 పైసలు కూడా వేయలేదని దుయ్యబట్టారు. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ చెప్పినట్లు 20 కోట్ల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఇచ్చి ఉంటే తెలంగాణలో అసలు నిరుద్యోగ సమస్య ఉండేది కాదన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలతో కాంగ్రెస్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ప్రజల అభిమానాన్ని వమ్ము చేయమని పేర్కొన్నారు. అనంతరం కొందరు గృహ నిర్మాణ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం