తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mahabubabad : చేపల లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తా.. ఒక్కసారిగా ఎగబడ్డ జనం!

Mahabubabad : చేపల లోడ్‌తో వెళుతున్న లారీ బోల్తా.. ఒక్కసారిగా ఎగబడ్డ జనం!

24 September 2024, 14:05 IST

google News
    • Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర ఘటన జరిగింది. చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆ లారీలో ఉన్నవారిని కాపాడాల్సిన స్థానికులు.. చేపల కోసం ఎగబడ్డారు. ఎవరికి దొరికిన చేపలను వారు పట్టుకొని వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చేపల కోసం ఎగబడ్డ జనం
చేపల కోసం ఎగబడ్డ జనం

చేపల కోసం ఎగబడ్డ జనం

మహబూబాబాద్ జిల్లా మరిపెడ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న చేపలు రోడ్డుపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని కాపాడకుండా.. అక్కడి స్థానికులు చేపల కోసం ఎగబడ్డారు. చేపలను సంచుల్లో నింపుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను అదుపు చేశారు.

చేపల లోడ్ లారీ.. ఖమ్మం జిల్లా నుంచి వరంగల్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. రోడ్డుపై పడిన చేపలను స్థానికులు పట్టుకుంటుండగా.. వీడియో తీశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ప్రమాదం జరిగి వారు బాధపడుతుంటే.. స్థానికులు మాత్రం చేపలు పడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు.

మే నెలలో సికింద్రాబాద్‎‌ బోయిన్‌పల్లి ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ లిక్కర్ లారీ బోల్తా పడింది. ఆ లారీ నుంచి కేస్‎ల కొద్దీ లిక్కర్ సీసాలు రోడ్డుపై పడిపోయాయి. వాటిని తీసుకొని అక్కడి జనం పరుగులు తీశారు. మద్యం లారీ బోల్తా పడడమే ఆలస్యం.. మందుబాబులు గద్దల్లా వాలి.. మద్యం బాటిళ్లని ఎత్తుకొని పారిపోయారు. ఆ లారీ వాళ్లకు ఏదైనా సాయం చేద్దామనే ఆలోచన అక్కడ ఏ ఒక్కరికీ రాలేదు.

ఆ మధ్య కృష్ణా జిల్లా గన్నవరం హైవేపై పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ కావడంతో తొలుత అందరూ భయపడి పరుగులు పెట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లో పెట్రోలు నేలపాలు కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. కానీ.. అయితే కొందరు స్థానిక ప్రజలు మాత్రం.. బకెట్లు, బాటిల్స్ తీసుకొచ్చి పెట్రోల్ నింపుకుని ఎత్తుకుపోయారు.

ఇటీవల కోళ్ల లోడ్​తో వెళ్తున్న వ్యాన్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ వద్ద బోల్తా పడింది. లక్ష్మాపూర్ నుంచి సిద్దిపేటకు 1200 కోళ్లతో వెళ్తున్న వాహనం.. లక్ష్మాపూర్ సబ్​స్టేషన్ వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కోళ్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న పరిసర ప్రాంతాల ప్రజలు, వాహనదారులు దొరికిన కోళ్లను దొరికినట్టుగా తీసుకెళ్లారు. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్.. సుమారు 800 కోళ్లను మాయం చేసినట్టు వాపోయాడు.

తదుపరి వ్యాసం