Khammam Floods : శభాష్ సుభాన్.. ప్రాణాలకు తెగించి వరద బాధితులను కాపాడిన జేసీబీ డ్రైవర్
Khammam Floods : ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తాయి. అనేక గ్రామాలు వరదల్లోనే నానుతున్నాయి. అటు మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో 9 మంది ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జ్‌పై చిక్కున్నారు. వారిని జేసీబీ డ్రైవర్ ప్రాణాలకు తెగించి కాపాడారు.
ఖమ్మం నగరం ప్రకాష్ నగర్ బ్రిడ్జ్‌పై వరదలో చిక్కుకున్న 9 మందిని జేసీబీ డ్రైవర్ ప్రాణాలకు తెగించి కాపాడారు. వరదల్లో చిక్కుకున్న వారిని హెలీకాప్టర్లతో రక్షించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తుండగా.. ఆలస్యం అయ్యింది. అదే సమయంలో సుభాన్ ధైర్యంగా వెళ్లారు. 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో సుభాన్ రియల్ హీరో అంటూ.. ఖమ్మం ప్రజలు కొనియాడుతున్నారు.
వెంకటగిరి గ్రామానికి చెందిన 9 మంది.. ఖమ్మం నగరం సమీపంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జ్‌పై వరదలో చిక్కుకున్నారు. ఆ సమయంలో.. మున్నేరు వాగు అత్యంత అధృతంగా ప్రవహిస్తోంది. భయాందోళనకు గురైన బాధితులు.. తమను కాపాడాలని వేడుకున్నారు. కానీ ఎవ్వరూ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అధికారులు హెలీకాప్టర్ల కోసం ప్రయత్నం చేశారు. ఇటు వరద ఉధృతి మరింత పెరుగుతోంది. వరదల్లో చిక్కుకున్నవారు ఇంకా భయపడుతున్నారు.
పోతే ఒక్కడినే..
సరిగ్గా అదే సమయంలో హర్యానాకు చెందిన జేసీబీ డ్రైవర్ సుభాన్ ధైర్యం చేశారు. తాను వెళ్లి తీసుకొస్తానని జేసీబీతో ముందుకెళ్లారు. అక్కడున్న స్థానికులు వద్దని వారించారు. వరద ఎక్కుగా ఉంది వెళ్లొద్దని సూచించారు. కానీ సుభాన్ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి ముందుకే వెళ్లారు. 'పోతే వాళ్లలో నేనూ ఒకడిని.. వస్తే 10 మందిమి' అంటూ ధైర్యంగా ముందుకెళ్లారు. 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
మంత్రులపై ప్రజల ఆగ్రహం..
అటు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా.. మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మంత్రుల కుటుంబ సభ్యులు వరదల్లో చిక్కుకుంటే ఇలాగే ఉంటారా అని నిలదీస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వరదలు ఇంకా తగ్గలేదు. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇంకా అనేక గ్రామాలు వరద నీటిలోనే చిక్కుకున్నాయి. బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వరద బాధితులను పరామర్శించనున్నారు.