Petrol Bunk : బంకుల్లో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ అయిపోతే ముందే మీకు సమాచారం.. సరికొత్త ప్లాన్
Petrol Bunk Fuel : బైక్ ఎక్కడో ఆగిపోతుంది.. తోసుకుంటూ బంకు వరకు వెళ్తాం. అక్కడకు వెళ్లేసరికి పెట్రోల్ లేదు అనే బోర్డ్ దర్శనమిస్తుంది. దీంతో చిరాకు లేస్తుంది. కానీ ఇకపై అలాంటి సమస్య ఉండదు. బంకుల్లో ఫ్యూయల్ ఉందో లేదో మీరు ముందే తెలుసుకోవచ్చు.
చాలాసార్లు ఫ్యూయల్ స్టేషన్‌కు వెళితే, అవి కొన్నిసార్లు మూసివేసి ఉంటాయి. అప్పటికే బైక్ తోసుకుంటూ వచ్చిన మీరు ఇదే ఖర్మరా బాబు అనుకుంటారు. ఇకపై అలాంటి సమస్యలు ఉండవు. మీరు రియల్‌టైమ్ సమాచారం తెలుసుకోవచ్చు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వదేశీ స్టార్టప్ ఫ్యూయల్ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ నవగతి ఫ్యూయల్ స్టేషన్ అనుభవాన్ని వేగంగా మారుస్తోంది.
ఫ్యూయల్ స్టేషన్లకు సంబంధించిన వినియోగదారుల సమస్యలన్నింటినీ రియల్ టైమ్‌లో పరిష్కరించడానికి కంపెనీ తన టెక్నాలజీని విస్తరించబోతోంది. 2025 చివరి నాటికి నవగతి ఫ్యూయల్ యాప్‌లో వినియోగదారులను 1.5 మిలియన్ల నుండి 5 మిలియన్లకు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనితో పాటు ఇంధన ప్లాట్‌ఫామ్ యాప్‌లో తెలుగు, కన్నడ, గుజరాతీ, తమిళం, మలయాళం భాషలను చేర్చడం ద్వారా సాధారణ ప్రజలకు సేవలను సులభతరం చేయడానికి కంపెనీ ప్రణాళికను సిద్ధం చేసింది.
రియల్ టైమ్ సమాచారం
నవగతి యాప్ తన వినియోగదారులకు ఫ్యూయల్ స్టేషన్ లొకేషన్, సౌకర్యాలు, ఇంధన ధరలు వంటి రియల్ టైమ్ సమాచారాన్ని అందిస్తుంది. ఇంధన లభ్యత, నిరీక్షణ సమయం, ఎంత దూరం అనేది రియల్ టైమ్ సమాచారాన్ని చెబుతుంది. దీని ద్వారా మీ చుట్టు పక్కల ఉండే బంకుల్లో ఫ్యూయల్ ఉందా లేదా మీకు తెలిసిపోతుంది.
కొత్త ప్లాన్ గురించి నవగతి సీఈఓ వైభవ్ కౌశిక్ మాట్లాడారు. '2025 నాటికి నవగతి దేశవ్యాప్తంగా దాదాపు 5 మిలియన్ల వినియోగదారులకు చేరుకుంటుంది. రోజువారి సాధనంగా మారుతుందని మేం నమ్ముతున్నాం. దీనితో స్మార్ట్ ఫ్యూయల్ స్పేస్‌లో లీడర్‌గా మా స్థానాన్ని బలోపేతం చేసుకోగలుగుతాం.' అని చెప్పారు.
నవగతి ప్లాట్‌ఫామ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. 2025 చివరి నాటికి 20,000 ఫ్యూయల్ పంప్ అవుట్‌లెట్లను జోడించాలని కంపెనీ యోచిస్తోంది. ఫ్యూయల్ స్టేషన్లలో ఇంధనం నింపే ప్రక్రియను వేగవంతంగా, మరింత సమర్థవంతంగా చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్ సహాయపడుతుంది.
ఇంధనం ఉందో.. లేదో చెప్పేస్తుంది
దీని కోసం ఫ్యూయల్ పంప్ డీలర్లు డిజిటల్ డ్యాష్‌బోర్డుల ద్వారా కనెక్ట్ అయి ఉంటారు. ఇవి స్టేషన్ కార్యకలాపాల గురించి రియల్ టైమ్ సమాచారాన్ని అందిస్తాయి. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ బంకుల్లో ఉందో అయిపోతుందో కస్టమర్‌కు సమాచారం ఇస్తాయి. రాబోయే రెండేళ్లలో నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తామని నవగతి ధీమా వ్యక్తం చేసింది. ఫ్యూయల్ స్టేషన్ ఆపరేటర్లకు ఆధునిక వినియోగదారుల అవసరాలను తీర్చడానికి, వారి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతున్నామని కంపెనీ అంటోంది.
ప్రాంతీయ భాషల్లోనూ
హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, తెలుగు భాషలతో పాటు కన్నడ, గుజరాతీ, తమిళం, మలయాళం భాషలను కూడా ఈ ప్లాట్‌ఫామ్ చేర్చే పనిలో ఉంది. దీంతో యాప్ ఫీచర్లు స్థానిక భాషల్లో అందుబాటులోకి రావడంతో పాటు మరింత మంది వినియోగదారులు సేవలను సద్వినియోగం చేసుకోగలుగుతారు.
ఢిల్లీ ఎన్సీఆర్, ముంబయి, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, భోపాల్, చెన్నై, పుణె, లక్నో, పాట్నా, జైపూర్ వంటి టైర్ 1, టైర్ 2 నగరాల్లో కంపెనీ తన ఉనికిని విస్తరిస్తోంది. వారణాసి, రత్నగిరి, లాతూర్, గోవా, ఖరగ్ పూర్, గౌహతి, జమ్మూ వంటి కొత్త ప్రాంతాలకు కూడా కంపెనీ తన సేవలను అందించే పనిలో ఉంది.
టాపిక్