Honda Flex-Fuel Motorcycle । డబుల్ డోస్ పవర్‌తో హోండా ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్!
Honda Flex-Fuel Motorcycle: ఇప్పటికే ఎలక్రిక్ వాహనాలను విడుదల చేసిన హోండా, తమ బ్రాండ్ నుంచి మొట్టమొదటి ఫ్లెక్స్- ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ వివరాలు చూడండి.
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అట్సుషి ఒగాటా ధృవీకరించారు. 2024 చివరి నాటికి భారతదేశంలో ఇథనాల్ మిశ్రమంతో నడిచే మోడల్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫ్లెక్స్-ఇంధన వాహనాలపై భారత ప్రభుత్వం నుంచి స్పష్టమైన రోడ్‌మ్యాప్ కోసం తమ కంపెనీ ఎదురుచూస్తోందని ఒగాటా స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ జీవ ఇంధనాల సదస్సులో HMSI సీఈఓ అట్సుషి ఒగాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'భారత ప్రభుత్వం ప్రస్తుతం ఫ్లెక్స్-ఇంధన వాహనాలకు సంబంధించి దాని రోడ్‌మ్యాప్‌పై పని చేస్తోంది. వివరాలు ఇంకా అస్పష్టంగా ఉన్నప్పటికీ, HMSI అందుకు సిద్ధంగా ఉండాలని భావిస్తోంది' అని పేర్కొన్నారు. 2024 నాటికి కనీసం ఒక మోడల్ బైక్ (Honda Flex-Fuel Motorcycle) లాంచ్ చేస్తామని ఒటాగా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం లభించే ఇంధనంలో 20% ఇథనాల్-బ్లెండింగ్ విషయానికి వస్తే, తమ బ్రాండ్ లోని ఇంజిన్ లైనప్‌లకు వర్తింపజేయవచ్చునని చెప్పారు.
What is Flex-Fuel Vehicle.. ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనం అంటే?
ఫ్లెక్సిబుల్-ఇంధన వాహనం లేదా ద్వంద్వ-ఇంధన వాహనం అనేది ఒకటి కంటే ఎక్కువ ఇంధనాలపై పనిచేసేలా రూపొందించిన ప్రత్యేక ఇంజన్ కలిగిన వాహనం. సాధారణంగా గ్యాసోలిన్‌ను ఇథనాల్ లేదా మిథనాల్ ఇంధనంతో కలుపుతారు. అంటే ప్రస్తుతం మనకు లభించే పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనంలో మరొక ఇంధనం కలపడం. ఈ రకంగా పెట్రోల్, డీజిల్ ఇంధనాన్ని పొదుపు చేయవచ్చు.
వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి దేశంలోని కొన్ని ప్రాంతాలలో గ్యాసోలిన్‌తో 20% ఇథనాల్ మిశ్రమాన్ని ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఇందుకోసం హోండా కంపెనీ ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
ఇంధనాన్ని ఆదా చేసేలా ఇప్పటికే భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ వాహనాలు, LNG వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. టొయోటా కూడా ఇటీవల తమ ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాన్ని విడుదల చేసింది.
ఇంధన ధరలు తగ్గుతాయా?
భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు. ఇక్కడి వాహనాలకు ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది. ప్రపంచ దేశాలలో ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినపుడు, దాని ప్రభావం ఇంధన ధరలపై పడుతోంది. ఫలితంగా దేశంలో అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వాయుకాలుష్యం కూడా ఒక సవాలుగా ఉంది. దీనంతటికి పరిష్కార మార్గంగా భారత్, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను, ఫ్లెక్స్- ఇంధన వాహనాలు, బయోఫ్యుఎల్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. భారత్ ఒకవేళ ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడే స్థితిలో లేనపుడు, సహజంగానే ధరలు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది.
సంబంధిత కథనం