Petrol diesel price hiked : వినియోగదారులకు షాక్​! పెట్రోల్​- డీజిల్​ ధరలు పెంచిన పంజాబ్​ ప్రభుత్వం-petrol diesel price hiked in punjab check new rates here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Petrol Diesel Price Hiked : వినియోగదారులకు షాక్​! పెట్రోల్​- డీజిల్​ ధరలు పెంచిన పంజాబ్​ ప్రభుత్వం

Petrol diesel price hiked : వినియోగదారులకు షాక్​! పెట్రోల్​- డీజిల్​ ధరలు పెంచిన పంజాబ్​ ప్రభుత్వం

Sharath Chitturi HT Telugu
Sep 06, 2024 01:35 PM IST

Petrol diesel price hiked in Punjab : పంజాబ్​లో పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెంచిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఆ రాష్ట్రంలో ఇంధన ధరలు ఎంత పెరిగాయంటే..

ఆ రాష్ట్రంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంపు..
ఆ రాష్ట్రంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంపు.. (REUTERS)

2024 లోక్​సభ ఎన్నికల అనంతరం పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచుతున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఇంధనపై ట్యాక్స్​ని పెంచాయి. ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి పంజాబ్ చేరింది. పెట్రోల్, డీజిల్​పై వ్యాట్​ (వాల్యూ యాడెడ్​ ట్యాక్స్​)ను పెంచింది. ఫలితంగా రాష్ట్రంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. డీజిల్​పై 13.09 శాతం, పెట్రోల్​పై 16.52 శాతం ధరలను పెంచాలని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంధన ధరలపై రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసే వ్యాట్​పై 10 శాతం సర్ చార్జీకి ఇవి అదనం! ఇంధన ధరల పెంపు నిర్ణయం వల్ల రూ.3000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని పంజాబ్ ప్రభుత్వం ఆశిస్తోంది.

తాజా ఇంధన ధరల పెరుగుదల ప్రకారం, పంజాబ్​లో పెట్రోల్ ధర లీటరుకు 61 పైసలు, డీజిల్ ధర లీటరుకు 92 పైసలు పెరిగింది. పెంపు అమలుకు ముందు పొరుగున ఉన్న ఛండీగఢ్ కన్నా పంజాబ్​లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. మొహాలీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.62 ఉండగా, ఛండీగఢ్​లో రూ.94.29గా ఉంది. అదే విధంగా, మొహాలీలో లీటరు డీజిల్​ రూ .88.13, పొరుగు నగరంలో ధర కంటే లీటరుకు రూ .6 ఎక్కువ.

పంజాబ్​లో నేటి నుంచి కొత్త పెట్రోల్, డీజిల్ రేట్లు అమల్లోకి రానున్నాయి. మొహాలీలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.23, డీజిల్ ధర రూ.89.05గా ఉంది. ఛండీగఢ్, పంచకులతో కూడిన ట్రైసిటీలో మొహాలీలో ఇంధన ధర అత్యధికంగా ఉంది.

పంజాబ్​లో పెట్రోల్, డీజిల్​పై వ్యాట్ పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పలువురు పెట్రోల్ బంకుల డీలర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని పంజాబ్​లోని పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ మండిపడింది. పొరుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంధనంపై తక్కువ వ్యాట్​ను ఆఫర్ చేస్తుండటంతో పెట్రోలియం డీలర్లు ఇప్పటికే అమ్మకాల్లో గణనీయమైన క్షీణతను ఎదుర్కొంటున్నారని డీలర్ల సంఘం ప్రతినిధి మోంటీ సెహగల్ తెలిపారు. “ఈ పెరుగుదల పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది, ఇది డీలర్లకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయ నష్టానికి దారితీస్తుంది,” అని ఆయన అన్నారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఇతర రాష్ట్రాల నుండి ఇంధనం స్మగ్లింగ్​ని సైతం ప్రోత్సహిస్తుందని మొహాలీకి చెందిన పెట్రోల్ పంప్ డీలర్ అశ్విందర్ సింగ్ మోంగియా ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ కంటే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ వంటి ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా చౌకగా ఉన్నందున అక్కడి డీలర్లు ఈ నిర్ణయంతో ఎంతో ప్రయోజనం పొందుతారని ఆయన అభిప్రాయపడ్డారు.

జమ్ములో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటరుకు రూ .81.26 రూపాయలు, డీజిల్ ధర లీటరుకు రూ .95.41 రూపాయలుగా ఉంది. హిమాచల్ ప్రదేశ్​లోని ఉనాలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.2, డీజిల్ ధర రూ.85.57గా ఉంది.

దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.83 ఉండగా, డీజిల్ ధర రూ.88.65గా ఉంది.

మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో పెట్రోల్​, డీజిల్​ ధరలు చాలా కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్​లో లిటరు పెట్రోల్​ ధర రూ. 107.41గా ఉంది. లీటరు డీజిల్​ ధర రూ. 95.65గా ఉంది.