AP New Liquor Policy : ఏపీ నూతన మద్యం పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్- సగటు లిక్కర్ ధర రూ.99, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి
AP New Liquor Policy : ఏపీ కొత్త మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చల అనంతరం కొత్త మద్యం పాలసీని ఆమోదించింది. అలాగే సగటు మద్యం ధరలు రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది.
AP New Liquor Policy : ఏపీ నూతన మద్యం పాలసీకి కేబినెట్ ఆమోద ముద్రవేసింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం...కొత్త మద్యం పాలసీపై సుదీర్ఘంగా చర్చించింది. ఎన్నికల హామీ మేరకు నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని కేబినెట్ నిర్ణయించింది. సగటు మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచాలని కేబినెట్ స్పష్టంచేసింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. వాలంటీర్ల వ్యవస్థపైనా కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది.
వాలంటీర్ వ్యవస్థ, ఆడబిడ్డ నిధి, బీసీ కార్పొరేషన్ నిధులు వంటి పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తుంది. పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పరిశ్రమలకు భూముల కేటాయింపు, సీఎం ప్రకటించిన వరద సాయానికి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు.
మద్యం షాపుల్లో గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు
ప్రైవేట్ మద్యం దుకాణాల వైపే కొత్త లిక్కర్ పాలసీ మొగ్గు చూపింది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్య విధానం అమలు తీసుకు రానున్నట్టు మంత్రి వర్గ ఉపసంఘం ప్రకటించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త ఎక్సైజ్ పాలసీకి శ్రీకారం చుడుతున్నట్టు మంత్రులు ప్రకటించారు. మంత్రి వర్గం ఉపసంఘం నివేదిక ఇవాళ కేబినెట్ ముందు ఉంచారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు అందించేలా కొత్త ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్టు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వెల్లడించారు. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం వివరాలు వెల్లడించారు.
డ్రగ్స్ నియంత్రించేలా, మత్తుకు బానిసలైన వారిని రక్షించేలా కొన్ని చర్యలకు నిధులు కేటాయించనున్నారు. 5-6 పరీక్షలు నిర్వహించిన తర్వాతే మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. గత ప్రభుత్వ పాలసీపై జరుగుతున్న విచారణలో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తి లేదని, గత ప్రభుత్వంలో డిస్టలిరీస్ ను కూడా కబ్జా చేశారని మంత్రులు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి మద్యం షాపులు కేటాయించనున్నారు. గత ప్రభుత్వ మద్యం పాలసీ ఈ సెప్టెంబర్ తో క్లోజ్ అవుతుంది. రిటైర్డ్ జడ్జితో టెండర్ కమిటీ అలాగే జిల్లా స్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
సంబంధిత కథనం