AP New Liquor Policy : మందుబాబులకు అదిరిపోయే న్యూస్, కేబినెట్ ఆమోదం లభిస్తే చాలు-ఇక అక్టోబర్ 1 నుంచి!
AP New Liquor Policy : మందుబాబులు ఎన్నాళ్ల నుంచో ఏ వార్త కోసం ఎదురుచూస్తున్నారో... ఆ టైమ్ దగ్గర పడింది. ఏపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీపై కసరత్తు పూర్తి చేసింది. కేబినెట్ ఆమోదం లభిస్తే అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వచ్చేస్తుంది. ఇవాళ సీఎం చంద్రబాబు కొత్త మద్యం పాలసీపై చర్చించారు.
AP New Liquor Policy : వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాల్లో మద్యం పాలసీ కూడా ఒకటని విశ్లేషకుల విశ్లేషణ. మద్యం రేట్లు భారీగా పెంచడం, ఎవరికీ తెలియని బ్రాండ్లు, నాణ్యతలేని మద్యంతో...మందుబాబులు విసిగిపోయి కూటమి వైపు చూశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యంతో పాటు, లిక్కర్ రేట్లు తగ్గిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీలు ఇచ్చాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటింది. ఇక మా వంతు ఎప్పుడా అని మందుబాబులు ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల నుంచి నూతన విధానం అమలు చేస్తామని తెలిపింది. ఇప్పటికే నూతన మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ రాష్ట్రాల మద్యం విధానాలపై అధ్యయనం చేసి కొత్త పాలసీని తీసుకురాబోతుంది.
సీఎం వద్దకు నూతన మద్యం పాలసీ
తాజాగా నూతన మద్యం పాలసీపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ విధానంపై మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎంకు వివరించారు. వివిధ రాష్ట్రాల్లోని మద్యం విధానాలను ఉన్నతాధికారులు అధ్యయనం చేశారు. వీటి గురించి సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. ఆరు రాష్ట్రాల మద్యం పాలసీలపై సేకరించిన సమాచారాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. పలు మార్పుచేర్పులతో పాటు నూతన మద్యం పాలసీ రూపకల్పనపై సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరో రెండ్రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో పాలసీపై చర్చించిన అనంతరం కొత్త మద్యం విధానాన్ని ఖరారు చేయనున్నారు.
భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది. 2014 నుంచి 2019 మధ్య అమల్లో మద్యం పాలసీని అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మద్యం పాలసీ అమల్లోకి వస్తే మందు బాబులకు బిగ్ రిలీఫ్ దక్కనుంది. అటు ఎన్నికల సమయంలోనూ తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వస్తే.. మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీని అధ్యయనం చేశారు.
అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏపీలో అమలవుతున్న మద్యం పాలసీ సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త లిక్కర్ పాలసీపై కూటమి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. మరో రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నెల 18న జరిగే కేబినెట్ భేటీలో కొత్త లిక్కర్ పాలసీపై చర్చ జరగనుంది. కేబినెట్ ఆమోదం తర్వాత కొత్త పాలసీని ప్రకటించనున్నారు.
సంబంధిత కథనం