తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vemulawada Temple : సీతారాముల కళ్యాణం వేళ శివయ్యతో జోగినీల పరిణయం - వేములవాడలో కొనసాగుతున్న వింత ఆచారం

Vemulawada Temple : సీతారాముల కళ్యాణం వేళ శివయ్యతో జోగినీల పరిణయం - వేములవాడలో కొనసాగుతున్న వింత ఆచారం

HT Telugu Desk HT Telugu

17 April 2024, 16:15 IST

    • Seeta Rama Kalyanam at Vemulawada : వేములవాడలో వింత ఆచారం కొనసాగుతూనే  ఉంది. శ్రీరామనవమి వేళ సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుండగా.. మరోవైపు శివుడిని పలువురు జోగినీలు పరిణయం ఆడారు.
వేములవాడ ఆలయం
వేములవాడ ఆలయం

వేములవాడ ఆలయం

Seeta Rama Kalyanam at Vemulawada: శ్రీరామనవమికి ప్రపంచవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంటే దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ(Vemulawada)లో వింత ఆచారం కొనసాగుతుంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఓ వైపు సీతారాముల కళ్యాణం జరిగే శుభముహూర్తాన మరోవైపు శివపార్వతులుగా పిలువబడే జోగినిలు, హిజ్రాలు శివుడిని వివాహం చేసుకున్నారు. ఒకే వేదికపై రెండు వివాహ సన్నివేశాలు వేములవాడలో ప్రతి ఏటా శ్రీరామనవమికి కన్నుల పండువలా జరుగుతాయి. అనేక దశాబ్దాలుగా సాగుతున్న శివపార్వతుల పెళ్లి విశ్వాసంతో మొదలై, ఆచారంగా పరిణమించింది. జీవనశైలిగా ఇక్కడ దర్శనమిస్తోంది. అలవికాని పేదరికం, తీవ్రమైన అనారోగ్యం, ఎదుగు బొదుగులేని జీవితం, నిరాశావహమైన భవిష్యత్తు వారిని దేవుణ్ణి పెళ్లి చేసుకునేలా చేస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి తరువాత అంతే వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది. అయితే దేశంలో మరెక్కడ లేని విధంగా, ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణంలో జోగినీలు శివుడిని తమ భర్తగా భావించి వివాహాలు చేసుకుంటారు. శివుడిని పరిణయం ఆడడం అనే సాంప్రదాయం నాలుగు దశాబ్దాల క్రితం నుండే ఇక్కడ కొనసాగుతోందని ఆలయ అర్చకులు తెలిపారు.

దేవుడి పెళ్ళికి భారీగా తరలివచ్చిన శివపార్వతులు

వేదికపై ఓవైపు దేవతామూర్తులకు కళ్యాణోత్సవం వైభవంగా సాగుతుంటే, ఆ సన్నిధిలోనే జోగినీలు శివుడిని తమ నాధునిగా భావించి ధారణ చేస్తారు. కేవలం ఈ వివాహం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా చత్తీస్గడ్, మహారాష్ట్ర ల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్ ,జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, కొమరం భీం, మంచిర్యాల, ఆదిలాబాద్, జనగామ, వరంగల్, సిద్దిపేట, మెదక్ జిల్లాల నుండి ఎక్కువగా, ఇతర జిల్లాల నుండి సంఖ్య కాస్త తక్కువగా శివపార్వతులుగా మారిన స్రీలు,పురుషులు, పిల్లలు వేములవాడలో జరిగే శ్రీరామ నవమికి తప్పక హాజరవుతారు. సీతారామ చంద్రులకు తలంబ్రాలు సమర్పించే వేళ వేములవాడ రాజన్న సన్నిధిలో శివపార్వతుల వివాహ ఘట్టం తలంబ్రాల వర్షం కురుస్తున్నట్టు మారిపోతుంది. శివపార్వతులు నవమి రోజున శివుడిని తమ భర్తగా భావించి వివాహాన్ని పునరుద్ధరించుకునేందు కోసమే ఇక్కడికి వేల సంఖ్యలో తరలివస్తారు. శివపార్వతుల వివాహ సమయంలో వారి చేతుల్లోని త్రిశూలం గంటలమోతలు, కళ్యాణ వేదిక ప్రాంగణమంతా వర్షపు జల్లుగా కురిసే తలంబ్రాలు, శివసత్తుల పూనకాలు అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. రుద్రాక్షలు మంగళసూత్రాలుగా, కాళ్లకు రాగిమట్టెలు, చేతికి త్రిశూలం ఇచ్చి వీరశైవులు వీరి పెళ్లి తంతును పూర్తి చేస్తారు.

రామయ్య పెళ్ళిలో.. శివపార్వతులకు తలంబ్రాలు

రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే.. నవమి నాటికి శివపార్వతులు వేములవాడ చేరుకుంటారు. శివుడితో ధారణ పేరుతో తమ పెళ్లిళ్లు పునరుద్ధరించుకుంటారు. ఈ సంఖ్య 50 వేల నుండి లక్ష వరకు ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. సీతారామ కళ్యాణానికి ముందే శివపార్వతులు కొత్త దుస్తులు ధరించి, నుదుట పెద్ద బొట్టుతో, తలపై జీలకర్ర బెల్లం, చేతిలో త్రిశూలం, భుజానికి జోలె, అక్షింతలు పట్టుకొని శివుడితో వివాహానికి సిద్ధమవుతారు. ఇందులో వైవాహిక జీవితం గడుపుతున్న వారు కూడా ఉన్నారు. అనారోగ్య కారణాలు, జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలు తెలంగాణలో అనేక మందిని శివపార్వతులుగా మార్చడంలో దోహదపడుతున్నాయి. వేములవాడ దేవస్థానంలో శివపార్వతుల పెళ్లి తంతు వీరశైవులు నిర్వహిస్తారు. శివపార్వతులుగా మారేవారికి వీరశైవులు మెడలో రుద్రాక్షను మంగళసూత్రంగా వేస్తారు. కాళ్లకు రాగి మట్టెలు తొడిగి స్త్రీ, పురుష భేదం లేకుండా వారికి చీర కట్టిస్తారు. అనంతరం చేతికి త్రిశూలం ఇచ్చి శివుడితో పెళ్లి జరిపిస్తారు. దీంతో ఆయా స్త్రీ, పురుషులు శివపార్వతులుగా మారినట్టు భావిస్తారు. శివపార్వతులు కనీసం ఐదు ఇళ్లలో, శ్రావణమాసంలో కొన్ని వారాలపాటు భిక్షాటన చేస్తారు. శివుడిని పెళ్లి చేసుకున్న తరువాత శివుడి భార్యగానే కొనసాగుతున్న వారు ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా మెరుగైన జీవనం గడుపుతున్న వారు, కుటుంబ జీవన వ్యవస్థలో కొనసాగుతున్న వారిలో కొందరు నవమి రోజు వేములవాడ వచ్చి ఈ ధారణ కార్యక్రమంలో పాల్గొంటారు.

సీతారాముల కళ్యాణ శుభ ముహూర్తాన శివుడుని వివాహం చేసుకున్నట్లు భావించే శివపార్వతులు సాయంత్రం జరిగే శోభాయాత్ర లో హల్చల్ చేస్తారు. శివపార్వతులు జోగినిలు హిజ్రాలు డిజే సౌండ్స్ తో డప్పు నృత్యాలు చేస్తూ హంగామా సృష్టిస్తారు. రాత్రి పొద్దుపోయే వరకు ఆడి పాడిన శివపార్వతులు మరుసటి రోజు పోచమ్మకు బోనాల సమర్పించి విందు భోజనాలు ఆరగిస్తారు. శివుడిని వివాహం చేసుకున్న శివపార్వతులు రాజన్న సన్నిధిలో మొక్కులు చెల్లించి తిరుగు ప్రయాణం అవుతారు.

ఆచారాన్ని రూపుమాపేందుకు,,,

మహిళలు, పురుషులే కాదు.. లోకజ్ఞానం తెలియని ఆడపిల్లను శివపార్వతులుగా మార్చే శివుడితో పెళ్లి తంతు ప్రక్రియ ధారణ పేరుతో వేములవాడ రాజన్న సన్నిధిలో ఏళ్ల తరబడి సాగిపోతూనే ఉంది. అటు ప్రభుత్వం, ఇటు పోలీసు యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు చిన్నారుల పెళ్ళికి అభ్యంతరాలు చెబుతున్నా, పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందే తప్ప.. ఆచారం మాత్రం యధావిధిగా కొనసాగుతూనే ఉంది. దైవభక్తితో సాగుతున్న వింత ఆచారం వికృత రూపం దాల్చకుండా ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

రిపోర్టింగ్ - HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar

తదుపరి వ్యాసం