Vemulawada : వేములవాడలో వింత ఆచారం - శివుడితో జోగినిల వివాహం!-thousands of devotees attired as brides of lord shiva at vemulawada ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vemulawada : వేములవాడలో వింత ఆచారం - శివుడితో జోగినిల వివాహం!

Vemulawada : వేములవాడలో వింత ఆచారం - శివుడితో జోగినిల వివాహం!

HT Telugu Desk HT Telugu
Mar 28, 2024 08:26 PM IST

Vemulawada Temple: దేవుడిని వివాహం చేసుకునే వింత ఆచారం వేములవాడలో కొనసాగుతూనే ఉంది. ఇందుకు సంబంధించి వేడుక ఇవాళ ఘనంగా జరిగింది.

వేములవాడ ఆలయం
వేములవాడ ఆలయం

Vemulawada Temple: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో వింత ఆచారం కొనసాగుతుంది. అనాదిగా శివ కళ్యాణం రోజున శివపార్వతులుగా పిలువబడే జోగినీలు శివుడిని వివాహం చేసుకుంటారు. అద్భుతమైన ఆ ఘట్టాన్ని గురువారం వేములవాడ (Vemulawada)శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో వైభవంగా నిర్వహించారు. శైవక్షేత్రాల్లో ఎక్కువగా మహాశివరాత్రి రోజున శివకళ్యాణం జరిగితే వేములవాడలో మాత్రం కామదహనం అనంతరం త్రిరాత్రి ఉత్సవాలు నిర్వహించిన అనంతరం శివకళ్యాణం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఐదు రోజుల పాటు శివకళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ సన్నిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో శివపార్వతులకు కళ్యాణం నిర్వహించారు.

త్రిశూలమే భర్తగా….

Sri Raja Rajeshwara Swamy Devasthanam: శివ కళ్యాణానికి రాష్ట్ర నలుమూలల నుంచి శివపార్వతులుగా పిలువబడే జోగినీలు భారీగా తరలివచ్చారు. ఓ వైపు శివ కళ్యాణం జరుగుతుంటే అదే ముహుర్తాన మరో వైపు త్రిశూలమే భర్తగా భావిస్తు జోగినీలు వివాహం చేసుకున్నారు. త్రిశూలానికి బాసింగం కట్టి, నెత్తిన జిలకర్రబెల్లం పెట్టుకుని మెడలో లింగంకాయ మంగళసూత్రంగా భావిస్తు శివుడితో పెళ్ళి అయినట్లు తమకు తాము అక్షింతలు వేసుకున్నారు. శివ కళ్యాణానికి ముందు జోగినీలు జోలెపట్టి ఐదు ఇళ్ళు తిరిగి భిక్షాందేహి అంటు అడుకుంటారు. అనంతరం జంగమయ్య వద్ద దారణ చేసుకుని మెడలో లింగం కాయకట్టుకుంటారు. ఆ లింగం కాయనే మంగళసూత్రంగా భావిస్తారు. ఈ వింత ఆచారాన్ని స్త్రీ పురుష వయోభేదం లేకుండా పాటిస్తారు. పురుషులైతే స్త్రీ వేషాదారణలో శివ కళ్యాణానికి హాజరై శివుడిని పెళ్ళి చేసుకుంటారు. ఇంట్లో ఒంట్లో బాగా లేకుంటే వేములవాడ రాజన్నకు మొక్కడంతో అంతాబాగుండడంతో శివుడికే అంకితం అవుతున్నామని జోగినీలు తెలిపారు. కొందరు దేవుడి పేరుమీదనే వివాహం చేసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతుండగా మరికొందరు మాత్రం వివాహం చేసుకుని భార్యపిల్లలతో ఉంటారని శివపార్వతులు చెప్పారు. అనాదిగా ఈ సాంప్రదాయం కొనసాగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీరామనవమి రోజున ఇదే తంతు…

శివ కళ్యాణం రోజున మాత్రమే కాకుండా ప్రతియేటా శ్రీరామ నవమి రోజున వేములవాడలో(Sri Raja Rajeshwara Swamy Devasthanam) అదే తంతు జరుగుతుంది‌. శ్రీరామనవమికి అంతట సీతారాముల కళ్యాణం జరిగితే వేములవాడ రాజన్న సన్నిధిలో సీతారాముల కళ్యాణం జరుగుతున్న మూహుర్తాన శివపార్వతులు, జోగినీలు శివుడిని వివాహం చేసుకుంటారు. శివ కళ్యాణం రోజున వచ్చిన వారికంటే రెట్టింపు సంఖ్యలో శ్రీరామనవమికి శివపార్వతులు జోగినీ లు తరలివస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక నుంచి సైతం భక్తులు వస్తారు.

జోగినీల హంగామా…..

శివుడుని భర్తగా భావిస్తూ దేవుడిని పెళ్ళి చేసుకునే శివపార్వతులు జోగినిలు, హిజ్రాల హంగామా అంతా ఇంతా కాదు. దేవుడితో పెళ్ళి అనంతరం తలువాలు (అక్షింతలు) పడ్డాయని సంబురపడుతారు. డిజే సౌండ్స్ తో డ్యాన్స్ చేస్తూ హల్ చల్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. దైవ భక్తితో కొందరు సాంప్రదాయ పద్దతిలో ఉండగా మరికొందరు శృతిమించి ప్రవర్తిస్తారు. కొందరు(ఇజ్రాలు) చేసే వికృత చేష్టల వల్ల తమ పరువుపోతుందని జోగినీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడితో పెళ్ళి అభాసుపాలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

రిపోర్టింగ్ - కరీంనగర్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు

IPL_Entry_Point