WTC Final Schedule: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ షెడ్యూల్ ఇదే.. ఎక్కడ జరుగుతుందంటే?
08 February 2023, 16:18 IST
- WTC Final Schedule: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ షెడ్యూల్ ను బుధవారం (ఫిబ్రవరి 8) ఐసీసీ రిలీజ్ చేసింది. 2021-23 సైకిల్లో టాప్ 2లో నిలిచిన రెండు జట్లు ఈ ఫైనల్లో తలపడతాయి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ షెడ్యూల్ రిలీజ్
WTC Final Schedule: మరో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ క్లైమ్యాక్స్ కు చేరువైంది. 2021-23 సైకిల్ కు గాను ఈ ఏడాది ఫైనల్ జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ బుధవారం (ఫిబ్రవరి 8) రిలీజ్ చేసింది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి 11 వరకూ జరగనుంది. జూన్ 12ను రిజర్వ్ డేగా ప్రకటించారు.
ఈ విషయాన్ని ఐసీసీ ట్విటర్ ద్వారా అనౌన్స్ చేసింది. "ఈ ఏడాది జరగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తేదీలు రివీల్ అయ్యాయి" అని ట్విటర్ లో ఐసీసీ వెల్లడించింది. ఈ ఫైనల్ మ్యాచ్ లండన్ లోని ది ఓవల్ గ్రౌండ్లో జరగనుంది.
నిజానికి ఈసారి లార్డ్స్ లో ఈ ఫైనల్ జరుగుతుందని భావించినా.. ది ఓవల్ లోనే జరగనున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ 2021లో సౌథాంప్టన్ లో జరిగింది. ఈ ఫైనల్లో ఇండియాపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు ఇలా..
తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియా.. ఈసారి కూడా రేసులో ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఈ టేబుల్లో 75.56 పర్సెంటేజ్ పాయింట్లతో టాప్ లో ఉంది. ఆ తర్వాత ఇండియా 58.93 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. ఇప్పుడీ రెండు టీమ్సే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ లో తలపడబోతున్నాయి.
ఈ సిరీస్ గురువారం (ఫిబ్రవరి 9) నుంచి నాగ్‌పూర్ లో జరగబోయే తొలి టెస్టుతో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ గెలిస్తే ఇండియా ఫైనల్ చేరుతుంది. అయితే ఒక్క మ్యాచ్ కంటే ఎక్కువగా ఓడిపోకూడదు.
ఇక ఈ టేబుల్లో మూడో స్థానంలో ఉన్న శ్రీలంక (53.33), నాలుగో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా (48.72) కూడా ఫైనల్ బెర్త్ పై ఆశతో ఉన్నాయి. శ్రీలంక విదేశాల్లో రెండు టెస్టుల సిరీస్, సౌతాఫ్రికా స్వదేశంలో వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడనున్నాయి.