Rohit Sharma to Australia: ముందు క్రికెట్‌పై దృష్టి పెట్టండి.. పిచ్‌లపై ఆస్ట్రేలియా ఆరోపణలకు రోహిత్ దిమ్మదిరిగే కౌంటర్-rohit sharma to australia says focus on cricket instead of discussing about pitches ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Rohit Sharma To Australia Says Focus On Cricket Instead Of Discussing About Pitches

Rohit Sharma to Australia: ముందు క్రికెట్‌పై దృష్టి పెట్టండి.. పిచ్‌లపై ఆస్ట్రేలియా ఆరోపణలకు రోహిత్ దిమ్మదిరిగే కౌంటర్

Hari Prasad S HT Telugu
Feb 08, 2023 03:52 PM IST

Rohit Sharma to Australia: ముందు క్రికెట్‌పై దృష్టి పెట్టండి అంటూ నాగ్‌పూర్ పిచ్‌పై ఆరోపణలు చేసిన ఆస్ట్రేలియాకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. తొలి టెస్ట్ జరగబోయే పిచ్ ఇండియాకు అనుకూలంగా చేస్తున్నారని ఆస్ట్రేలియా మాజీలు ఆరోపించిన విషయం తెలిసిందే.

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (PTI)

Rohit Sharma to Australia: ఓ కీలకమైన సిరీస్ కు ముందు మైండ్ గేమ్స్ ఆడటం ఆస్ట్రేలియాకు కొత్త కాదు. ఎప్పుడూ ప్రత్యర్థిని మాటలతో మానసికంగా కుంగదీసి ఆటలో పైచేయి సాధించాలని చూస్తుంది. ఇప్పుడు ఇండియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు అవే ఎత్తుగడలు వేస్తోంది. ముఖ్యంగా ఎంతో చర్చ నడుస్తున్న పిచ్ లే లక్ష్యంగా ఆస్ట్రేలియా మాజీలు, అక్కడి మీడియా ఆరోపణలు చేస్తున్నారు.

మంగళవారం నాగ్‌పూర్ పిచ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. అందులో పిచ్ క్యూరేటర్ పిచ్ పై అక్కడక్కడా నీళ్లు చల్లి, రోలింగ్ చేస్తుండటంపై జేసన్ గిలెస్పీలాంటి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐసీసీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. సిరీస్ ప్రారంభం కాకముందే పిచ్ లపై ఆరోపణలు చేయొద్దన్నాడు.

ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరింత ఘాటుగా స్పందించాడు. ముందు క్రికెట్‌పై దృష్టి పెట్టండి అంటూ ఆస్ట్రేలియాకు చురకలు అంటించాడు. "పిచ్ ను కావాలని మార్చాలన్న ఆరోపణలపై స్పందించాలంటే.. వచ్చే ఐదు రోజులు ముందు క్రికెట్‌పై దృష్టి పెట్టండనే నేను చెబుతాను. పిచ్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించవద్దు.

గత సిరీస్ లోనూ పిచ్ ల గురించి చాలా చర్చే జరిగింది. 22 మంది నాణ్యమైన ప్లేయర్స్ ఆడతారు. అందువల్ల పిచ్ లు ఎలా ఉంటాయి.. ఎంత టర్న్ అవుతుంది.. ఎంత సీమ్ అవుతుంది అన్నది పక్కన పెట్టండి. మంచి క్రికెట్ ఆడండి గెలవండి అంతే" అని రోహిత్ అన్నాడు.

స్పిన్ కు అనుకూలించే కండిషన్సే ఉంటాయని అనుకుంటున్నట్లు రోహిత్ చెప్పాడు. "ఓ ప్లాన్ ఉండటం ముఖ్యం. ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది. కొందరు స్వీప్ చేస్తారు, కొందరు రివర్స్ స్వీప్.. కొందరు బౌలర్ల తలపై నుంచి బాదుతారు. కొన్నిసార్లు స్ట్రైక్ రొటేట్ చేయాలి. కొన్నిసార్లు కౌంటర్ అటాక్ చేయాలి. కెప్టెన్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. బౌలర్లను, ఫీల్డర్లను మారుస్తూ ఉంటారు. అందుకు తగినట్లు ప్లాన్ చేసి ఆడాలి" అని రోహిత్ చెప్పాడు.

ఇక తుది జట్టు ఎంపికపై కూడా రోహిత్ స్పందించాడు. "ఇది కఠినమైన నిర్ణయమే. అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. బాగా ఆడుతున్నారు. కొందరిని పక్కన పెట్టడం కష్టమే" అని రోహిత్ అన్నాడు. కండిషన్స్ ను చూసిన తర్వాత అందుకు తగిన టీమ్ ను ఎంపిక చేస్తామని చెప్పాడు.

WhatsApp channel

సంబంధిత కథనం