Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియాకు భారత బౌలర్ల నుంచి సవాలే.. ఇబ్బందిపడక తప్పదు.. టీమిండియా మాజీ వ్యాఖ్యలు
Border-Gavaskar Trophy: ఫిబ్రవరి 9 నుంచి జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా బ్యాటర్లకు.. భారత బౌలర్ల నుంచి సవాల్ తప్పదని టీమిండియా మాజీ సబా కరీమ్ హెచ్చరించారు. భారత బౌలింగ్ విభాగం బలంగా ఉందని స్పష్టం చేశారు.
Border-Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 9న నాగ్‌పుర్ వేదికగా తొలి టెస్టు ఆడనుంది. ఈ టెస్టు సిరీస్ రెండు జట్లకు ఎంతో కీలకం కానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే స్వదేశంలో భారత్‌కు తిరుగులేని రికార్డు ఉండటం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో బలంగానే కనిపిస్తోంది. పలువురు మాజీలు సైతం ఈ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా టీమిండియా మాజీ వికెట్ కీపింగ్ బ్యాటర్ సబా కరీమ్ తన స్పందనను తెలియజేశారు. భారత్ బౌలింగ్ దళం.. ఆస్ట్రేలియా బ్యాటర్లను ఇబ్బంది పెడతారని స్పష్టం చేశారు.
"రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు ఈ విషయంలో ప్రశంసించాలి. బ్యాటర్లు సులభంగా పరుగులు చేసేందుకు వారు ఎలాంటి అవకాశాన్ని కల్పించరు. ఇద్దరు సంధించే బంతులు బ్యాట్ ఎడ్జ్ తాకి బ్యాటర్లను ఇబ్బంది పెడతాయి. జడేజా బంతి అనూహ్యంగా లోపలకు రావచ్చు. అలాగే వెనుదిరగవచ్చు." అని సబా కరీమ్ అన్నారు.
ఇలాంటి నైపుణ్యం చాలా జట్లలో ఉండదని సబా కరీమ్ తెలిపారు. నాథన్ లయన్ విషయానికొస్తే అతడి అమ్ముల పొదిలో క్యారమ్ బాల్ లేదని, అతడి అతడి ప్రదర్శనపై ప్రభావం చూపించవచ్చని అన్నారు.
"రెగ్యూలర్ ఆఫ్ స్పిన్నర్ల మాదిరిగా అశ్విన్ బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ అవుతుంది. అలాగే అతడు సంధించే క్యారమ్ బంతులు బ్యాట్‌కు ఔట్ సైడ్ ఎడ్జ్ అయ్యే అవకాశముంది. చాలా జట్లకు ఇలాంటి బౌలింగ్ కాంబినేషన్ ఉండదు. నాథన్ లయన్ తీసిన ఎక్కువ వికెట్లు ఇన్ సైడ్ ఎడ్జ్ నుంచి వచ్చినవే. అతడి వద్ద క్యారమ్ బాల్ ఆప్షన్ లేదు." అని సబా కరీమ్ తెలిపారు. మరోపక్క భారత్ పేస్ బౌలింగ్ ఎటాక్ కూడా అద్భుతంగా ఉందని స్పష్టం చేశారు.
"భారత్ పేస్ బౌలింగ్ దళం సమతూకంగా ఉంది. స్పిన్నర్లదే ఆధిపత్యమైనప్పటికీ మన పేస్ బౌలర్లు వారికి అద్భుతంగా మద్దతు ఇస్తారు. భారత పిచ్‌ల్లో రివర్స్ స్వింగ్ ఎలా చేయాలో వారికి బాగా తెలుసు. ఫాస్ట్ బౌలర్లు సరైన సమయంలో రాణించడం ఇక్కడ కీలకం." అని ఆయన అన్నారు.