Gillespie to Australia: కోహ్లి బ్యాటింగ్‌కు రాగానే కమిన్స్ బౌలింగ్ చేయాలి: ఆస్ట్రేలియా మాజీ సూచన
Gillespie to Australia: కోహ్లి బ్యాటింగ్‌కు రాగానే కమిన్స్ బౌలింగ్ చేయాలని సూచించాడు ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జేసన్ గిలెస్పీ. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో ఈ ఇద్దరి మధ్య పోరు ఆసక్తి రేపుతోందని అన్నాడు.
Gillespie to Australia: యాషెస్ సిరీస్, ఇండోపాక్ మ్యాచ్ ల స్థాయిలో ఆసక్తి రేపుతోంది ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఎనిమిదేళ్లుగా ఈ ట్రోఫీని తన దగ్గరే పెట్టుకున్న టీమిండియా.. ఈసారి స్వదేశంలో జరగబోయే ఈ సిరీస్ నూ గెలవాలని చూస్తోంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఈ టీమ్స్ లోని ప్లేయర్స్ మధ్య పోరు ఎంతో ఆసక్తి రేపుతోంది.
అశ్విన్ వర్సెస్ లబుషేన్, హేజిల్ వుడ్ వర్సెస్ రోహిత్ శర్మ, నేథన్ లయన్ వర్సెస్ పుజారా.. ఇలా ఒక్కో ప్లేయర్ కు ప్రత్యర్థి టీమ్ లో మరొకరితో పోటీ ఉంది. వీటిలాగే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిల మధ్య ఫైట్ ఉత్కంఠ సాగుతుందన్న అంచనా ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ జేసన్ గిలెస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నిజానికి కోహ్లిపై కమిన్స్ ఎక్కువ సక్సెస్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లు కలిపి 9 సార్లు కోహ్లిని కమిన్స్ ఔట్ చేశాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ లోగిలిలో బాల్స్ వేసి కోహ్లిని కమిన్స్ బోల్తా కొట్టించాడు. దీంతో ఈసారి కూడా ఈ ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని గిలెస్పీ భావిస్తున్నాడు.
"కోహ్లి వర్సెస్ కమిన్స్ పోరును చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. వాళ్లది ఎంతో అద్భుతమైన పోరు. ఈ సిరీస్ లో వాళ్లు ఎలా ఆడతారో చూడాలి. విరాట్ కోహ్లి బ్యాటింగ్ కు రాగానే నేరుగా కమిన్స్ బౌలింగ్ కు దిగాలి. ఇది చూడటానికి ఎంతో బాగుంటుంది. ఇద్దరు గొప్ప క్రికెటర్ల మధ్య పోరు అద్భుతం" అని గిలెస్పీ అన్నాడు.
తొలి టెస్టులో స్టార్క్ లేకపోవడంతో ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ భారం కమిన్స్, హేజిల్ వుడ్ లపైనే ఎక్కువగా ఉంది. అయితే ఈసారి కూడా స్పిన్ బౌలింగే ఎక్కువగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నా.. గిలెస్పీ మాత్రం ఆసీస్ పేస్ బౌలింగ్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాడు.
"స్టార్క్ లెఫ్టామ్ పేస్ బౌలర్. చాలా ఆలస్యంగా బంతిని రివర్స్ స్వింగ్ చేస్తాడు. కానీ హేజిల్ వుడ్, కమిన్స్ ఇద్దరూ బాగా బౌలింగ్ చేస్తున్నారు. పాత బంతితో వాళ్లు నిజంగా ప్రభావం చూపగలరు. గ్రీన్ ను కూడా చూడాల్సి ఉంది. ఇండియన్ బ్యాటర్లకు అతనితోనూ సవాలు ఎదురు కానుంది. ఈ సిరీస్ లో బంతి రివర్స్ స్వింగ్ అవడం మనం చూస్తాం" అని గిలెస్పీ అన్నాడు.
సంబంధిత కథనం