Michael Clarke on India vs Australia: ఇండియాలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకపోవడం ఆస్ట్రేలియాకు నష్టమే: మైకేల్ క్లార్క్-michael clarke on india vs australia says no tour game is going to be significant
Telugu News  /  Sports  /  Michael Clarke On India Vs Australia Says No Tour Game Is Going To Be Significant
ఆస్ట్రేలియా టీమ్
ఆస్ట్రేలియా టీమ్ (REUTERS)

Michael Clarke on India vs Australia: ఇండియాలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకపోవడం ఆస్ట్రేలియాకు నష్టమే: మైకేల్ క్లార్క్

24 January 2023, 10:35 ISTHari Prasad S
24 January 2023, 10:35 IST

Michael Clarke on India vs Australia: ఇండియాలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకపోవడం ఆస్ట్రేలియాకు నష్టమే అని అన్నాడు ఆ టీమ్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్. వచ్చే నెల 9 నుంచి ప్రారంభం కాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని ఆసీస్ టీమ్ నేరుగా అడుగుపెడుతోంది.

Michael Clarke on India vs Australia: భారత ఉపఖండంలో టెస్ట్ సిరీస్ అంటే ఎలాంటి టీమ్ కైనా అంత సులువు కాదు. ఒకప్పుడు ప్రపంచాన్ని జయించి వచ్చిన ఆస్ట్రేలియా కూడా ఇండియాలో దారుణంగా బోల్తా పడింది. ఇప్పటికీ ఆ టీమ్ రికార్డు ఇక్కడ చాలా చెత్తగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసీస్ టీమ్ మరో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇండియా రానుంది.

అయితే ఈ నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఆ టీమ్ ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడటం లేదు. నేరుగా సిరీస్ బరిలోకి దిగడం ఆస్ట్రేలియాకు నష్టం చేస్తుందని ఆ టీమ్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. ఫాక్స్ స్పోర్ట్స్ లో వచ్చే బిగ్ స్పోర్ట్స్ బ్రేక్‌ఫాస్ట్ షోలో మాట్లాడిన క్లార్క్.. ఇండియాలో ఆడటానికి, ఆస్ట్రేలియాలో ఆడటానికి చాలా తేడా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రాక్టీస్ గేమ్ లేకపోయినా ఫర్వాలేదన్న ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ కామెంట్స్ పై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

"నాకు అర్థం కాని విషయం ఇదే. ఇండియాలో తొలి టెస్టుకు ముందు టూర్ గేమ్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది చాలా ప్రభావం చూపనుంది. ఇండియాలో వన్డే క్రికెట్, టీ20 క్రికెట్ ఆడటం వేరు.. టెస్ట్ క్రికెట్ వేరు. ఆస్ట్రేలియాలో ఆడే ఆటకు పూర్తి భిన్నమైన ప్లాన్ తో ఇండియాలో ఆడాల్సి ఉంటుంది. స్పిన్ బౌలింగ్ లో, రివర్స్ స్వింగ్ లో ఆడటానికి పూర్తి భిన్నమైన ప్లాన్ ఉండాలి. ఆస్ట్రేలియాలో ఈ వేసవిలో అసలు రివర్స్ స్వింగ్ లేదు. రెండు, మూడు రోజుల్లోనే మ్యాచ్ లు ముగిశాయి" అని క్లార్క్ చెప్పాడు.

"ఇండియాలో రివర్స్ స్వింగ్ ముఖ్యమైన పాత్ర పోషించనుంది. ఇండియా కనీసం ఇద్దరు స్పిన్నర్లను బరిలోకి దింపనుంది. దీంతో ఇది పూర్తిగా భిన్నమైన ఆట అవుతుంది. ఇండియాలో పరిస్థితులు అనుకూలించినప్పుడే బ్యాటింగ్ చేయాలి. ఆ తర్వాత ఇండియా పరిస్థితులు అలవాటు లేకపోతే ఇన్నింగ్స్ మొదలుపెట్టడం చాలా కష్టమవుతుంది" అని క్లార్క్ హెచ్చరించాడు.

"ఒకసారి క్రీజులో కుదురుకున్నాక భారీ స్కోరు చేయాలి. ఎందుకంటే ఇండియాలో రెండో ఇన్నింగ్స్ లో చేసే తొలి 20 పరుగులు కూడా గగనమే. ఆస్ట్రేలియాలో స్పిన్ ఆడటానికి కాస్త ముందుకు వెళ్లి బాల్ ను సులువుగా బ్లాక్ చేయొచ్చు. కానీ ఇండియాలో మాత్రం అనూహ్యంగా బౌన్స్ అయి మీ గ్లోవ్స్ ను తాకొచ్చు. ఆఫ్ స్టంప్ బయట బ్లాక్ చేయడానికి వెళ్తే అది మీ లెగ స్టంప్ ను గిరాటేయొచ్చు. ఇండియన్ పిచ్ లలో వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది" అని క్లార్క్ అన్నాడు.

ఫిబ్రవరి 9 నుంచి ఇండియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. వచ్చే వారం ఆస్ట్రేలియా టీమ్ ఇండియాకు రానుంది. దీంతో వాళ్లకు ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి పెద్దగా సమయం ఉండదు. ఇప్పటికే రెండుసార్లు ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ లు గెలిచిన టీమిండియా.. 2014-15 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలుపుకుంటూ వస్తోంది.

సంబంధిత కథనం