తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Shahid Afridi Daughter: అవును.. నా కూతురు ఇండియా ఫ్లాగ్ పట్టుకుంది: అఫ్రిది

Shahid Afridi Daughter: అవును.. నా కూతురు ఇండియా ఫ్లాగ్ పట్టుకుంది: అఫ్రిది

Hari Prasad S HT Telugu

12 September 2022, 14:34 IST

google News
    • Shahid Afridi Daughter: ఇండియా, పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో తన కూతురు ఇండియా ఫ్లాగ్ పట్టుకున్నట్లు ఆ టీమ్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్ అఫ్రిది చెప్పడం విశేషం. అతడీ విషయాన్ని టీవీ డిబేట్‌లో పెద్దగా నవ్వుతూ చెప్పడం విశేషం.
షాహిద్ అఫ్రిది
షాహిద్ అఫ్రిది (IDI via Getty Images)

షాహిద్ అఫ్రిది

Shahid Afridi Daughter: ఆసియాకప్‌లో భాగంగా ఇండియా, పాకిస్థాన్‌ టీమ్స్‌ రెండుసార్లు తలపడ్డాయి. ఇందులో ఒకసారి ఇండియా, మరోసారి పాకిస్థాన్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌లూ చివరి ఓవర్‌ వరకూ తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగి ఫ్యాన్స్‌ను అలరించాయి. అయితే ఈ రెండు టీమ్స్‌ మధ్య సెప్టెంబర్‌ 4న జరిగిన సూపర్‌ 4 మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది.

ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ షాహిద్‌ అఫ్రిది చిన్న కూతురు ఇండియా జెండాను పట్టుకొని కనిపించింది. ఈ వీడియోలు వైరల్‌ అయ్యాయి. తాజాగా అఫ్రిది కూడా ఓ లైవ్‌ టీవీ డిబేట్‌లో తన కూతురు ఇండియన్‌ ఫ్లాగ్‌ పట్టుకున్న విషయాన్ని వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియోలు తనకు చాలా వచ్చాయని, అయితే వాటిని ట్వీట్‌ చేయాలో వద్దో అనుకొని బయటపెట్టలేదని చెప్పాడు.

ఆ మ్యాచ్‌లో పది శాతం పాకిస్థాన్‌ అభిమానులు ఉంటే.. 90 శాతం మంది ఇండియన్‌ ఫ్యాన్సే ఉన్నట్లు డిబేట్‌లో చర్చించుకుంటున్నారు. దీనిపై స్పందించిన అఫ్రిది.. ఇది నిజమేనని, ఈ విషయం తనకు తన భార్య చెప్పినట్లు అఫ్రిది తెలిపాడు. నిజానికి అక్కడ పాకిస్థాన్‌ జెండాలు కూడా దొరక్కపోవడంతో తన చిన్న కూతురు ఇండియన్‌ ఫ్లాగ్‌ పట్టుకున్నట్లు అఫ్రిది పెద్దగా నవ్వుతూ చెప్పాడు.

ఆ వీడియోలు కూడా తనకు ఎంతోమంది పంపించారని, అయితే దానిని ట్వీట్ చేయాలో వద్దోనన్న సంశయంతో చేయలేకపోయినట్లు అఫ్రిది తెలిపాడు. ఇది విన్న టీవీ యాంకర్లు షాక్‌ తిన్నారు. అదే ఓ ఇండియన్‌ అభిమాని పాకిస్థాన్‌ జెండా పట్టుకుంటే వాళ్ల దేశంలో ఎలా రియాక్టయ్యావారో అని అనడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియాపై పాకిస్థాన్‌ విజయం సాధించింది.

అదే మ్యాచ్‌లో కీలకమైన సమయంలో ఆసిఫ్‌ అలీ ఇచ్చిన క్యాచ్‌ను అర్ష్‌దీప్‌ సింగ్ డ్రాప్‌ చేసి ఎన్నో విమర్శలకు కూడా గురైన విషయం తెలిసిందే. ఇక ఆసియా కప్‌ ఆదివారం (సెప్టెంబర్‌ 11)తో ముగిసింది. పాకిస్థాన్‌ను 23 రన్స్‌తో చిత్తు చేసిన శ్రీలంక.. ఆరోసారి ఆసియా కప్‌ గెలవడం విశేషం. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక టీమ్‌.. తొలి మ్యాచ్‌లోనే ఆఫ్ఘన్‌ చేతిలో చిత్తుగా ఓడినా తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి ట్రోఫీ ఎగరేసుకుపోయింది.

తదుపరి వ్యాసం