India vs Pakistan Most Watched T20I: ఇండియా, పాకిస్థాన్ ఆసియాకప్ మ్యాచ్ కొత్త రికార్డులు
India vs Pakistan Most Watched T20I: ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన ఆసియాకప్ మ్యాచ్ కొత్త రికార్డులు సృష్టించింది. ఎక్కువ మంది చూసిన టీ20 మ్యాచ్‌గా ఇది నిలవడం విశేషం.
India vs Pakistan Most Watched T20I: ఇండియాలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ తెలుసు కదా. అందులోనూ ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అయితే ఈ క్రేజ్ పీక్ స్టేజ్‌లో ఉంటుంది. తాజాగా ఆసియా కప్‌లో జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కొత్త రికార్డులు సృష్టించడమే ఇందుకు నిదర్శనం. వరల్డ్‌కప్ కాని మ్యాచ్‌లలో అత్యధిక మంది చూసిన టీ20 ఇంటర్నేషనల్‌గా ఈ మ్యాచ్ నిలవడం విశేషం.
ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ ఈ రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా ఆసియా కప్ 2022 తొలి ఆరు మ్యాచ్‌లను 17.6 కోట్ల మంది వ్యూయర్లు చూశారు. ఇక ఆగస్ట్ 28న ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌నైతే ఏకంగా 13.3 కోట్ల మంది చూశారట. మొత్తంగా 1360 కోట్ల నిమిషాల వ్యూయింగ్ రిజిస్టర్ అయినట్లు కూడా డిస్నీ స్టార్ వెల్లడించింది.
ఇది 2016లో ఆసియాకప్‌లో భాగంగా జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కంటే కూడా 30 శాతం ఎక్కువ. ఈ కొత్త రికార్డుపై డిస్నీ స్టార్ స్పోర్ట్స్ హెడ్ సంజోగ్ గుప్తా స్పందించారు. "ఈ రికార్డులు తిరగరాసిన వ్యూవర్‌షిప్ క్రికెట్‌కు ఉన్న సత్తాను మరోసారి తెలియజేస్తోంది. ఆసియా కప్‌కు ఎక్కువ ఆదరణ వచ్చేలా ప్రమోట్ చేశాం. అందులోనూ ఇండియా,పాకిస్థాన్ మ్యాచ్‌లాంటి గొప్ప మ్యాచ్‌ను మిస్ కావద్దంటూ ప్రచారం చేశాం" అని సంజోగ్ చెప్పారు.
దీనివల్లే వరల్డ్‌కప్ బయట జరిగిన టీ20 మ్యాచ్‌లలో అత్యధిక మంది చూసిన మ్యాచ్‌గా ఇండోపాక్ లీగ్ మ్యాచ్ నిలిచిందని తెలిపారు. ఈ సీజన్‌లో టీమిండియా బిజీగా గడపనున్న నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్లకు ఇది నిజంగా గుడ్‌న్యూసే. సొంతగడ్డపై ఇండియా త్వరలోనే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్ జరగబోతోంది.
ఇక ఆసియా కప్ ప్రారంభానికి ముందు కూడా డిస్నీ స్టార్ చేసిన ప్రమోషన్లు ఈసారి వ్యూయర్‌షిప్ పెరగడానికి బాగా పనికొచ్చాయి. షాజ్ అండ్ వాజ్ షోగా ప్రసిద్ధిగాంచిన షోను రవి శాస్త్రి, వసీం అక్రమ్‌లతో కలిసి ఈసారి మళ్లీ ప్రారంభించింది. ఇక విరాట్ కోహ్లితో నిర్వహించిన విరాట్: హార్ట్ టు హార్ట్ స్పెషల్ షోకు కూడా మంచి ఆదరణ లభించింది. ఇక ఈ నెల 20 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభం కానుండగా.. ఇది కూడా డిస్నీ స్టార్‌లోనే ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ప్రసార హక్కులను కూడా ఇండియాలో డిస్నీ స్టారే దక్కించుకుంది.