Telugu News  /  Sports  /  Rohit Sharma Says 80 To 90 Percent Team Set For T20 World Cup
రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (PTI)

Rohit Sharma on World Cup Team: టీ20 వరల్డ్‌కప్‌ టీమ్ ఎంపిక దాదాపు పూర్తయింది: రోహిత్‌

17 August 2022, 21:42 ISTHari Prasad S
17 August 2022, 21:42 IST

Rohit Sharma on World Cup Team: టీ20 వరల్డ్‌కప్‌ కోసం టీమిండియా ఎంపికపై చర్చ జరుగుతుండగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలకమైన కామెంట్స్‌ చేశాడు. అవసరాన్ని బట్టి కొన్ని మార్పులు తప్ప టీమంతా రెడీ అని చెప్పడం విశేషం.

ముంబై: టీ20 వరల్డ్‌కప్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ టీమిండియా ఎంపికపై ఎంతో మంది మాజీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు? ఏ స్థానంలో ఎవరు బ్యాటింగ్‌ చేయాలి? పేస్‌ బౌలర్లు ఎంతమంది ఉండాలి? ఇలా ఒక్కో అంశంపై చర్చ జరుగుతోంది. అయితే దీనిపై కెప్టెన్ రోహిత్‌ శర్మ మాత్రం తొలిసారి స్పందించాడు. అవసరమైతే మూడు, నాలుగు మార్పులు తప్ప టీమ్‌ రెడీగా ఉందని చెప్పడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటికే 80 నుంచి 90 శాతం టీమ్‌ సెట్‌ అయిందని రోహిత్ అన్నాడు. "టీ20 వరల్డ్‌కప్‌కు ఇంకా రెండున్నర నెలల టైమ్‌ ఉంది. అంతకంటే ముందు ఆసియా కప్‌తోపాటు సొంతగడ్డపై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో సిరీస్‌లు ఉన్నాయి. ఆ లెక్కన టీమ్‌ 80 నుంచి 90 శాతం సెట్‌ అయింది. కండిషన్స్‌ను బట్టి మూడు లేదా నాలుగు మార్పులు ఉండే అవకాశం ఉంది" అని రోహిత్‌ చెప్పాడు.

ప్రస్తుతానికి ఇండియాలో ఆడుతున్నామని, తర్వాత యూఏఈలో ఆడతామని.. అయితే ఆస్ట్రేలియాలో కండిషన్స్‌ భిన్నంగా ఉండటం వల్ల అక్కడి పరిస్థితులను బట్టి టీమ్‌కు ఏది సూటవుతుందో చూస్తామని రోహిత్‌ అన్నాడు. అయితే తమ దృష్టంతా ప్రస్తుతం బెంచ్‌ స్ట్రెంత్‌ను బలంగా మార్చుకోవడంపై ఉందని, ఇండియాకు మ్యాచ్‌లను గెలిపించగల ప్లేయర్స్‌ ఎక్కువ మంది ఉండాలని అభిప్రాయపడ్డాడు.

"బుమ్రా, షమి, ఇతర ప్లేయర్స్‌ ఎప్పుడూ టీమ్‌తో ఉండరు. అందువల్ల ఇతర ప్లేయర్స్‌ను కూడా అందుకు సిద్ధం చేయాలి. నేను, రాహుల్‌ భాయ్‌ మన బెంచ్‌ స్ట్రెంత్‌ను ఎలా బలోపేతం చేయాలనేదానిపై చర్చించాం. మేము ఆడబోయే మ్యాచ్‌లు, గాయాలు, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఇదే కీలకం అవుతుంది. ఒకరు, ఇద్దరిపై ఆధారపడే టీమ్‌ ఉండకూడదన్నది మా ఉద్దేశం. ప్రతి ఒక్కరూ ఆడి టీమ్‌ విజయంలో తమ వంతు పాత్ర పోషించాలని మేము భావిస్తున్నాం" అని రోహిత్‌ అన్నాడు.