Telugu News  /  Sports  /  Arshdeep Singh Abused By A Fan Then An Indian Journalist Did This To Stop Him
అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్ట్ విమల్ కుమార్
అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్ట్ విమల్ కుమార్

Arshdeep Singh Abused by a fan: అర్ష్‌దీప్‌ను దేశద్రోహి అన్న అభిమాని.. జర్నలిస్ట్‌ ఏం చేశాడో చూడండి

07 September 2022, 14:32 ISTHari Prasad S
07 September 2022, 14:32 IST

Arshdeep Singh Abused by a fan: అర్ష్‌దీప్‌ను దేశద్రోహి అని ఓ అభిమాని విమర్శించడం విన్న ఓ జర్నలిస్ట్‌ అతనిపై మండిపడిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఈ ఘటన ఇండియా, శ్రీలంక మ్యాచ్‌ తర్వాత జరిగింది.

Arshdeep Singh Abused by a fan: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పేస్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ కీలకమైన క్యాచ్‌ డ్రాప్‌ చేయడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో అతన్ని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్‌ను అర్ష్‌దీప్‌ లైట్‌ తీసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

తనపై వచ్చిన కామెంట్స్‌ చూసి నవ్వుకున్నట్లు కూడా చెప్పాడు. అయితే శ్రీలంకతో మ్యాచ్‌ తర్వాత మాత్రం అర్ష్‌దీప్‌ తొలిసారి ఫేస్‌ టు ఫేస్‌ ఓ అభిమాని ఆగ్రహాన్ని చవిచూశాడు. అప్పటికే టీమంతా బస్సులో ఉండగా.. అర్ష్‌దీప్‌ చివర్లో బస్‌ ఎక్కడానికి వచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ అభిమాని.. దేశద్రోహి వచ్చాడంటూ పంజాబీలో కామెంట్‌ చేశాడు.

సోషల్ మీడియాలో ట్రోల్స్ ను అతడు తేలిగ్గా తీసుకున్నా.. ఈ అభిమాని అన్న మాటలు అర్ష్‌దీప్‌ కు ఆగ్రహం తెప్పించాయి. బస్సు ఎక్కుతూ ఉన్నప్పుడు అతని మాటలు విన్న అర్ష్‌దీప్‌.. కాసేపు ఆగి అతనివైపు కోపంగా చూశాడు. తర్వాత లోనికి వెళ్లిపోయాడు.

తనది ఇండియా అని చెప్పుకున్న ఆ అభిమాని.. ఇలా దారుణమైన కామెంట్స్‌ చేయడంతో అక్కడే ఉన్న ఇండియన్‌ జర్నలిస్ట్‌ విమల్‌ కుమార్‌ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలేం చేస్తున్నావ్‌ నువ్వు.. అతనో ఇండియన్‌ ప్లేయర్‌.. అలా అనడం సరి కాదు అంటూ సదరు అభిమానికి క్లాస్‌ పీకాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి అతనిపై ఫిర్యాదు చేశాడు.

వాళ్లు ఆ జర్నలిస్ట్‌కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పాక్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ క్యాచ్‌ డ్రాప్‌ చేయడం ఇండియా కొంప ముంచిన విషయం తెలిసిందే. అప్పటి వరకూ అతన్ని ఓ హీరోలా చూసిన వాళ్లే తిట్టడం మొదలుపెట్టారు. ఆ మ్యాచ్‌లో అతడు చివరి ఓవర్‌ వేశాడు. ఇప్పుడు శ్రీలంకతో మ్యాచ్‌లోనూ చివరి ఓవర్‌ను అర్ష్‌దీపే వేసినా.. కేవలం 7 పరుగులే ప్రత్యర్థికి అవసరం కావడంతో ఏమీ చేయలేకపోయాడు.

ఆసియా కప్‌ సూపర్‌ 4లో వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిన టీమిండియా ఫైనల్‌ చేరే అవకాశాలను దాదాపు చేజార్చుకుంది. బుధవారం పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ ఓడిపోతే ఇండియాకు దారులు మూసుకుపోతాయి.