Arshdeep Singh Wikipedia: అర్ష్‌దీప్ ఖలిస్తానీ వేర్పాటువాదా.. వికీపీడియాపై కేంద్రం సీరియస్
Arshdeep Singh Wikipedia: అర్ష్‌దీప్ ఖలిస్తానీ వేర్పాటువాది అంటూ అతని వికీపీడియా పేజ్‌ను మార్చడంపై కేంద్రం సీరియస్ అయింది. ఆ సంస్థ ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది.
Arshdeep Singh Wikipedia: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయిన తర్వాత పేస్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అతని వికీపీడియా పేజ్‌లో ఏకంగా వేర్పాటువాద గ్రూప్ ఖలిస్తాన్‌తో లింకులు పెట్టేలా ఎవరో మార్పులు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వికీపీడియా ప్రతినిధులకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో ఏం చేయబోతున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతేకాదు ఈ విషయాన్ని కేంద్రం చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. వికీపీడియాకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసే ఆలోచనలో ఉంది. దీనిపై వికీపీడియా ప్రతినిధులతో హిందుస్థాన్ టైమ్స్ సంప్రదించేందుకు ప్రయత్నించినా వాళ్ల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కీలకమైన సమయంలో ఆసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను అర్ష్‌దీప్ డ్రాప్ చేశాడు. ఇది మ్యాచ్‌ను మరోసారి పాకిస్థాన్ వైపు తిప్పింది. పైగా చివరి ఓవర్ కూడా అతడే వేశాడు. చివరికి మరో బాల్ మిగిలి ఉండగానే పాక్ 5 వికెట్లో గెలిచింది. దీంతో అప్పటి నుంచీ అభిమానులు కొందరు కావాలని అర్ష్‌దీప్‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కొందరు దారుణంగా అతన్ని ఖలిస్తానీ గ్రూపుతో లింకులు పెడుతూ అతని వికీపీడియా పేజ్‌కు మార్పులు చేశారు.
అర్ష్‌దీప్ సొంత దేశం ఇండియా ఉండగా.. ఆ స్థానంలో ఖలిస్తాన్ అని మార్చారు. అయితే ఇది గమనించిన మరో యూజర్ 15 నిమిషాల తర్వాత దానికి మరోసారి మార్పులు చేశారు. వికీపీడియాలో ఎవరైనా మార్పులు చేసుకునే వీలుండటమే దీనికి అసలు కారణం. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ సంస్థ ప్రతినిధులకు వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.
2020లోనూ ప్రభుత్వం ఇలాగే వికీపీడియాకు నోటీసులు జారీ చేసింది. ఇండియా మ్యాప్‌ను తప్పుగా చూపించిందన్న ఉద్దేశంతో ఓ పేజీని తొలగించింది. ఆ సమయంలో వికీపీడియా దానికి మార్పులు చేసి మరోసారి రీస్టోర్ చేసింది.