Virat Kohli: ఆరోజు నా కెరీర్ ముగిసిందనుకున్నా- ఛాంపియన్స్ ట్రోపీ సంఘటనను గుర్తుచేసుకున్న కోహ్లి
Virat Kohli: ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కీలక సమయంలో అర్షదీప్ క్యాచ్ జారవిడవటంతో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. అర్షదీప్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడికి కోహ్లి మద్ధుతగా నిలిచాడు.
Virat Kohli: ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. 18వ ఓవర్ లో పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ ఆసిఫ్ అలీ ఇచ్చిన సింపుల్ క్యాచ్ ను అర్షదీప్ సింగ్ మిస్ చేశాడు. తదుపరి బంతికే ఆసిఫ్ అలీ సిక్స్ కొట్టడంతో పాటు ఆ ఓవర్ లో మొత్తం 19 పరుగులు రావడంతో పాకిస్థాన్ విజయాన్ని అందుకున్నది. సులభమైన క్యాచ్ ను జారవిడిచిన అర్షదీప్ సింగ్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
అతడికి టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మద్ధతుగా నిలిచాడు. ఒత్తిడిలో ఉన్న సమయంలో తప్పులు జరగడం సహజమని పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గతంలో తన కెరీర్ లో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేశాడు. ‘తొలిసారి ఛాంపియన్స్ ట్రోపీ ఆడుతున్న సమయంలో నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను. ఆ టెన్షన్ లో పాకిస్థాన్ పై జరిగిన మ్యాచ్ లో చెత్త షాట్ ఆడి ఔటయ్యాను. అఫ్రిది బౌలింగ్ లో ఔట్ అయిన తీరును చాలా రోజుల పాటు మర్చిపోలేకపోయాను. ఆ రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత నిద్ర పట్టలేదు. తెల్లవారు జాము వరకు గది సీలింగ్ చూస్తూనే ఉండిపోయా.
ఆ రోజుతో నా కెరీర్ ముగిసిపోయిందని భయపడ్డా. మళ్లీ క్రికెట్ ఆడే అవకాశం రాదనిపించింది. ఒత్తిడి వల్లే అలా జరిగింది’ అని కోహ్లి తెలిపాడు. తప్పులు చేయని ఆటగాడు ఎవరూ ఉండరని అన్నాడు. ప్రతి ఒక్కరి కెరీర్ లో అవి సహజమని చెప్పాడు. తదుపరి మ్యాచ్ కు అన్ని సర్ధుకుంటాయని తెలిపాడు. కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకోవడం చాలా ముఖ్యమంటూ చెప్పి అర్షదీప్ కు అండగా నిలిచాడు. కోహ్లితో పాటు పలువురు మాజీ క్రికెటర్లు అర్షదీప్ కు మద్దతుగా నిలుస్తున్నారు.