Telugu News  /  Sports  /  Pakistan Beat India By 5 Wickets In Asia Cup Super Four Match
నవాజ్, రిజ్వాన్
నవాజ్, రిజ్వాన్ (AFP)

IND vs PAK: పాకిస్థాన్‌ చేతిలో పోరాడి ఓడిన టీమిండియా

04 September 2022, 23:32 ISTHari Prasad S
04 September 2022, 23:32 IST

IND vs PAK: ఆసియా కప్‌ సూపర్‌ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతుల్లో ఓడింది టీమిండియా. 5 వికెట్లతో గెలిచిన పాక్‌.. లీగ్‌ స్టేజ్‌లో ఎదురైన పరాభవానికి దెబ్బకు దెబ్బ తీసింది.

IND vs PAK: ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్‌ మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపింది. ఈసారి ఒక బాల్‌ మిగిలి ఉండగానే 5 వికెట్లతో పాక్ గెలిచింది. 182 రన్స్‌ టార్గెట్‌ను 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పాక్‌ చేజ్‌ చేసింది. టీ20ల్లో ఇండియాపై పాకిస్థాన్‌కు ఇదే అత్యధిక చేజ్‌ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో పాక్‌ వికెట్‌ కీపర్‌ 51 బాల్స్‌లో 71 రన్స్‌ చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ట్రెండింగ్ వార్తలు

అయితే కీలకమైన సమయంలో అర్ష్‌దీప్‌ సింగ్‌.. ఆసిఫ్‌ అలీ క్యాచ్ డ్రాప్‌ చేయడం, 19వ ఓవర్లో సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ 19 రన్స్‌ ఇవ్వడం టీమిండియా కొంప ముంచాయి. ఇక మధ్యలో 20 బాల్స్‌లోనే 42 రన్స్‌ చేసిన నవాజ్‌ కూడా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. చివరి ఓవర్లో 7 రన్స్‌ అవసరం కాగా.. అర్ష్‌దీప్‌ వేసిన రెండో బంతికి ఫోర్‌ కొట్టాడు ఆసిఫ్‌ అలీ.

ఆ తర్వాత 4వ బంతికి అతను ఔటవడంతో ఉత్కంఠ పెరిగింది. చివరి రెండు బాల్స్‌లో 2 అవసరం కాగా.. కొత్తగా క్రీజులోకి వచ్చిన ఇఫ్తికార్‌ తొలి బంతికే రెండు రన్స్‌ చేసి పాక్‌ను గెలిపించాడు. భువనేశ్వర్‌, యుజువేంద్ర చహల్‌, హార్దిక్‌ పాండ్యా తమ బౌలింగ్‌లో భారీగా రన్స్‌ సమర్పించుకున్నారు.

విరాట్ కోహ్లి ఒంటరి పోరాటం

అంతకుముందు టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లి హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. అయితే ఈ మ్యాచ్‌లో మొదట్లో ధాటిగా ఆడి భారీ స్కోరుపై ఆశలు రేపిన టీమ్‌.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 రన్స్‌ చేయగలిగింది. ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ చెరో 28 రన్స్‌ చేశారు. సూర్యకుమార్‌ (13), పంత్‌ (14), హార్దిక్‌ పాండ్యా (0), దీపక్‌ హుడా (16) విఫలమయ్యారు.

ఒక దశలో ఇండియా 10 ఓవర్లలోనే 3 వికెట్లకు 93 రన్స్‌ చేసింది. ఈ దశలో స్కోరు 200 దాటుతుందని అనిపించింది. కానీ మిడిల్‌ ఓవర్లలో వరుసగా వికెట్లు పడటంతో ఊహించిన స్కోరు సాధించలేకపోయింది. విరాట్‌ కోహ్లి మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. అతడు 44 బాల్స్‌లో 60 రన్స్‌ చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. చివరి ఓవర్లో చివరి రెండు బాల్స్‌కు రెండు ఫోర్లు కొట్టి టీమ్‌కు ఆ మాత్రం స్కోరైనా అందించాడు రవి బిష్ణోయ్‌. అతడు 2 బాల్స్‌ 8 రన్స్‌ అజేయంగా నిలిచాడు.