Sanju Samson Craze in Kerala: సంజు శాంసన్‌కున్న క్రేజ్ ఇదీ.. ఫొటోలు షేర్ చేసిన అశ్విన్, చహల్
26 September 2022, 20:30 IST
- Sanju Samson Craze in Kerala: సంజు శాంసన్‌కున్న క్రేజ్ ఇదీ అంటూ స్పెషల్ ఫొటోలు షేర్ చేశారు టీమిండియా క్రికెటర్లు అశ్విన్, చహల్. సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం టీమిండియా ప్లేయర్స్ తిరువనంతపురం చేరుకున్నారు.
సంజూ శాంసన్, అశ్విన్
Sanju Samson Craze in Kerala: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసిన మరుసటి రోజే టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. ఈసారి సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియాను 2-1తో చిత్తు చేసిన కాన్ఫిడెన్స్‌తో ఇండియా ఈ సిరీస్ బరిలో దిగుతోంది. ఇందులో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ కేరళలోని తిరువనంతపురంలో బుధవారం (సెప్టెంబర్ 28) జరగనుంది.
దీనికోసం సోమవారం (సెప్టెంబర్ 26) ఇండియన్ క్రికెట్ టీమ్ తిరువనంతపురం చేరుకుంది. అయితే కేరళ అంటే తెలుసు కదా. అక్కడ ఇండియన్ టీమ్ క్రికెటర్ సంజూ శాంసన్‌కు క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇండియన్ టీమ్‌ను చూడటానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన అభిమానులు సంజూ.. సంజు అంటూ హోరెత్తించారు. వాళ్ల ఫొటోలు తీసిన ఇండియన్ క్రికెటర్లు అశ్విన్, చహల్.. వాటిని శాంసన్ కోసం షేర్ చేశారు.
అశ్విన్ అయితే బస్‌లో కూర్చొనే ఫ్యాన్స్‌తో సెల్ఫీ దిగాడు. అటు చహల్ కూడా వాళ్ల ఫొటో తీసి ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరూ సంజూ శాంసన్‌ను ట్యాగ్ చేయడం విశేషం. వెస్టిండీస్ టూర్‌లో ఉన్న శాంసన్‌కు ఇప్పుడు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతోపాటు టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లోనూ చోటు దక్కని విషయం తెలిసిందే. ఇది అతని అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
ఇండియా, సౌతాఫ్రికా తొలి టీ20 సందర్భంగా శాంసన్ ఫ్యాన్స్ కొందరు బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మ్యాచ్ జరిగే గ్రీన్‌ఫీల్డ్ స్టేడియానికి సంజూ శాంసన్ ఫొటోలు ఉన్న టీషర్ట్స్ వేసుకొని వచ్చి నిరసన తెలపాలని ఫ్యాన్స్ నిర్ణయించుకున్నట్లు ఐఏఎన్‌ఎస్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఇండియన్ టీమ్‌లో స్థానం కోసం నలుగురు వికెట్ కీపర్లు పోటీ పడగా.. రిషబ్ పంత్, దినేష్ కార్తీక్‌ల వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. ఈ ఇద్దరినీ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌లతోపాటు టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేశారు. సంజూ శాంసన్‌తోపాటు ఇషాన్ కిషన్‌లకు నిరాశే ఎదురైంది. శాంసన్‌కు జరిగిన అన్యాయంపై ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తమ అసంతృప్తి వెల్లగక్కారు.
ఇక ఈ మధ్యే శాంసన్ ఇండియా ఎ టీమ్‌ను లీడ్ చేసిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ ఎతో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో సంజూ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్‌లూ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగాయి. ఈ సందర్భంగా సంజూని పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఛీర్ చేశారు.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, అశ్విన్, చహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, షమి, హర్షల్ పటేల్, దీపక్ చహర్, బుమ్రా