Rohit Sharma Record: ధోనీ, బాబర్ ఆజం రికార్డు సమం చేసిన రోహిత్ శర్మ
20 February 2023, 18:18 IST
- Rohit Sharma Record: ధోనీ, బాబర్ ఆజం రికార్డు సమం చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆస్ట్రేలియాపై రెండో టెస్ట్ విజయం తర్వాత రోహిత్ ఈ ఇద్దరి సరసన నిలిచాడు.
జడేజా, రోహిత్ శర్మ
తాజాగా ఆస్ట్రేలియాపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తిరుగులేని 2-0 లీడ్ సాధించింది. ఇక సిరీస్ కోల్పోయే అవకాశం మాత్రం లేదు. ఢిల్లీలో ముగిసిన రెండో టెస్టు తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఇప్పటి వరకూ గత 50 ఏళ్లలో ఈ రికార్డు ఇద్దరి పేరిట మాత్రమే ఉంది. అందులో ఒకరు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కాగా.. పాకిస్థాన్ ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజం.
ఇప్పుడీ ఇద్దరి సరసన రోహిత్ చేరాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. కెప్టెన్ గా తొలి నాలుగు టెస్టులలో విజయాలు సాధించడం. గతేడాది కోహ్లి నుంచి టెస్ట్ కెప్టెన్సీ అందుకున్న తర్వాత శ్రీలంకపై 2-0తో టీమిండియాను గెలిపించాడు రోహిత్ శర్మ. ఇక ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై 2-0 ఆధిక్యం సంపాదించింది.
ధోనీ తొలిసారి 2008లో ఇండియా టీమ్ కు టెస్ట్ కెప్టెన్ అయిన సందర్భంలో సౌతాఫ్రికాపై విజయం సాధించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై రెండు టెస్టులు, ఇంగ్లండ్ పై మరో టెస్ట్ గెలిచింది. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా ఇదే రికార్డును రిపీట్ చేశాడు.
అతడు కెప్టెన్ అయిన తర్వాత సౌతాఫ్రికాపై పాకిస్థాన్ 2-0తో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత బాబర్ కెప్టెన్సీలోనే జింబాబ్వేపై కూడా 2-0తో విజయం సాధించి సిరీస్ ఎగరేసుకుపోయింది. ఇప్పుడీ ఇద్దరి రికార్డును రోహిత్ సమం చేయడం విశేషం.
రోహిత్ శర్మ ఇప్పుడు ఆస్ట్రేలియాతో మార్చి 1 నుంచి జరగబోయే మూడో టెస్టులో కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. బ్యాట్స్‌మన్ గానూ ఈ నాలుగు టెస్టులలో రోహిత్ రాణించాడు. 45.5 సగటుతో 273 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో కఠినమైన పరిస్థితులలోనూ రోహిత్ 120 రన్స్ చేసిన విషయం తెలిసిందే.