Indian cricket Team Schedule 2023: వన్డే వరల్డ్‌కప్, ఆసియాకప్.. ఈ ఏడాది ఇండియన్ క్రికెట్ టీమ్ పూర్తి షెడ్యూల్ ఇదే
Indian cricket Team Schedule 2023: వన్డే వరల్డ్‌కప్, ఆసియాకప్‌లాంటి మెగా టోర్నీలతోపాటు 2023లో ఇండియన్ క్రికెట్ టీమ్ పూర్తి షెడ్యూల్ ఒకసారి చూద్దాం. ఈ ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా ఉంది.
Indian cricket Team Schedule 2023: ఇండియన్ క్రికెట్ టీమ్‌కు 2022 మిశ్రమ ఫలితాలను అందించింది. సౌతాఫ్రికా చేతుల్లో టెస్ట్ సిరీస్ ఓటమితో ప్రారంభమైన ఏడాది.. బంగ్లాదేశ్‌పై సిరీస్ క్లీన్‌స్వీప్‌తో ముగిసింది. మధ్యలో ఆసియాకప్, టీ20 వరల్డ్‌కప్‌లలో వైఫల్యాలూ ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఎంతోమంది కెప్టెన్లూ మారారు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో ఇప్పటికీ ఇండియా ఉండటం ఫ్యాన్స్‌కు కాస్త ఊరట కలిగించే విషయం.
ఈ నేపథ్యంలో కొత్త ఏడాది 2023లో ఇండియన్ క్రికెట్ టీమ్ పూర్తి షెడ్యూల్ ఒకసారి చూద్దాం. ఈ ఏడాది కూడా ఆసియాకప్, వన్డే వరల్డ్‌కప్, వుమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లాంటి మెగా టోర్నీలు ఉన్నాయి.
జనవరి 2023: ఇండియా vs శ్రీలంక (సొంతగడ్డపై)
శ్రీలంకతో సొంతగడ్డపై మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌తో కొత్త ఏడాదిని ఇండియా ప్రారంభించనుంది. మొదట మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది. జనవరి 3, జనవరి 5, జనవరి 7 తేదీల్లో ముంబై, పుణె, రాజ్‌కోట్‌లలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక ఆ తర్వాత వన్డే సిరీస్‌లో భాగంగా జనవరి 10, 12, 15 తేదీల్లో గువాహటి, కోల్‌కతా, త్రివేండ్రంలలో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి.
జనవరి, ఫిబ్రవరి 2023: ఇండియా vs న్యూజిలాండ్ (సొంతగడ్డపై)
ఆ తర్వాత న్యూజిలాండ్‌తోనూ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు టీమిండియా ఆడనుంది. ఇందులో భాగంగా తొలి వన్డే జనవరి 18న హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 21, 24 తేదీల్లో రాయ్‌పూర్, ఇండోర్‌లలో మిగతా రెండు వన్డేలు జరుగుతాయి. ఇక టీ20 సిరీస్‌లో భాగంగా జనవరి 27, 29, ఫిబ్రవరి 1న రాంచీ, లక్నో, అహ్మదాబాద్‌లలో జరుగుతాయి.
ఫిబ్రవరి, మార్చి 2023: ఇండియా vs ఆస్ట్రేలియా (సొంతగడ్డపై)
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్, మూడు వన్డేల సిరీస్‌ను ఇండియా ఆడనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగే ఈ నాలుగు టెస్ట్‌ల సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 సైకిల్‌లో ఇండియా ఆడబోయే చివరి సిరీస్. ఇందులో భాగంగా ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్ నాగ్‌పూర్‌లో, ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్ ఢిల్లీలో, మార్చి 1-5 వరకు ధర్మశాలలో మూడో టెస్టు, మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్ అహ్మదాబాద్‌లో జరుగుతాయి. ఇక ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ కూడా జరుగుతుంది. మార్చి 17, 19, 22 తేదీల్లో ముంబై, విశాఖపట్నం, చెన్నైలలో ఈ మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి.
మార్చి-మే 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)
జూన్ 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టేబుల్లో ప్రస్తుతం ఇండియా రెండోస్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్ ఇండియాకు కీలకం కానుంది. ఆ సిరీస్ గెలిస్తే అదే ఆస్ట్రేలియాతో జూన్‌లో జరగబోయే ఫైనల్లో ఇండియా తలపడుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఈ టేబుల్లో టాప్‌లో ఉంది.
జులై/ఆగస్ట్ 2023: వెస్టిండీస్ vs ఇండియా (వెస్టిండీస్‌లో)
ఇది వెస్టిండీస్‌లో ఇండియన్ క్రికెట్ టీమ్ పూర్తిస్థాయి టూర్. ఇందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగుతాయి. అయితే ఈ టూర్ పూర్తి షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
సెప్టెంబర్ 2023: ఆసియా కప్ 2023 (పాకిస్థాన్‌లో..)
2023లో ఆసియాకప్ పాకిస్థాన్‌లో జరగనుంది. ఆ దేశానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లేది లేదని చెప్పిన బీసీసీఐ.. ఆసియా కప్ వేదికను మరో చోటికి తరలించేలా ప్రయత్నిస్తామని చెప్పింది. ప్రస్తుతానికి టోర్నీ వేదికలో మార్పు లేకపోయినా.. టోర్నీకి ఇంకా చాలా సమయం ఉండటంతో ఏం జరుగుతుందో చూడాలి.
అక్టోబర్ 2023: ఇండియా vs ఆస్ట్రేలియా (సొంతగడ్డపై)
ఇండియాలోనే జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌కు ముందు మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా టీమ్ రానుంది. మెగా టోర్నీకి సన్నద్ధతలో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.
అక్టోబర్/నవంబర్ 2023: ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్
తొలిసారి ఇండియా మాత్రమే ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వనుంది. గతంలో 1987, 1996, 2011లలోనూ ఇండియా ఆతిథ్యమిచ్చినా.. పాకిస్థాన్, శ్రీలంకలాంటి దేశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహించింది. ఈసారి కేవలం ఇండియాలో మాత్రమే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
నవంబర్/ డిసెంబర్ 2023: ఆస్ట్రేలియా vs ఇండియా (సొంతగడ్డపై)
2023లో ముచ్చటగా మూడోసారి ఆస్ట్రేలియా టీమ్ ఇండియాకు రానుంది. ఇందులో భాగంగా ఐదు టీ20ల సిరీస్ ఆడుతుంది.
డిసెంబర్ 2023: సౌతాఫ్రికా vs ఇండియా (సౌతాఫ్రికాలో..)
2023 ఏడాదిని సౌతాఫ్రికా టూర్‌తో ఇండియా ముగించనుంది. ఇది పూర్తిస్థాయి టూర్. అంటే ఈ టూర్‌లో భాగంగా టెస్టులు, వన్డేలు, టీ20 సిరీస్‌లు ఇండియా ఆడనుంది.