Virat Kohli on T20 World Cup: కల నెరవేరకుండానే ఇంటికొచ్చేస్తున్నాం.. చాలా బాధగా ఉంది: విరాట్ కోహ్లి
Virat Kohli on T20 World Cup: కల నెరవేరకుండానే ఇంటికొచ్చేస్తున్నాం.. చాలా బాధగా ఉంది అంటూ వరల్డ్‌కప్ నుంచి ఔటైన మరుసటి రోజు శుక్రవారం (నవంబర్ 11) విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఇప్పుడీ పోస్ట్ వైరల్ అవుతోంది.
Virat Kohli on T20 World Cup: టీమిండియా మరో ఐసీసీ టోర్నీలో తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలుసు కదా. 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఇప్పటి వరకూ మరో ఐసీసీ టోర్నీ గెలవలేకపోయింది. వరుసగా సెమీస్, ఫైనల్ మెట్లపై బోల్తా పడుతూ ఇంటికొచ్చేస్తోంది. ఈ టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లో ఇంగ్లండ్ చేతుల్లో మరింత దారుణంగా ఓడి ఘోర అవమాన భారంతో ఇంటిదారి పట్టింది.
ఈ ఓటమిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం పోరాడి ఓడినా ఇంత ట్రోలింగ్ జరిగేది కాదేమో. కానీ గల్లీ బౌలర్లను ఆడుకున్నట్లు ఇంగ్లండ్ బ్యాటర్లు సులువుగా టార్గెట్ చేజ్ చేయడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఫ్యాన్స్‌కే ఇంత బాధ ఉంటే.. ఈ టోర్నీ మొత్తం టీమ్ భారాన్ని తన భుజాలపై మోసిన విరాట్ కోహ్లి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే ఇంగ్లండ్‌తో మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే విరాట్ ఇన్‌స్టాలో ఎంతో బాధతో ఓ పోస్ట్ చేశాడు. తమ కల నెరవేరడానికి కొద్ది దూరంలో ఆగిపోయినట్లు అతడు చెప్పాడు. "మా కల నెరవేరకుండానే ఆస్ట్రేలియాను వీడాల్సి వస్తోంది. చాలా బాధగా ఉంది. అయితే టీమ్‌లో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మా వెంట మోసుకొస్తున్నాం. ఇక్కడి నుంచి ఇంకా మెరుగవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ టోర్నీ మొత్తం పెద్ద సంఖ్యలో వచ్చి మాకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. ఈ జెర్సీ వేసుకోవడానికి, దేశం తరఫున ఆడటానికి ఎప్పుడూ గర్వంగానే ఫీలవుతాను" అని విరాట్ తన ఇన్‌స్టా పోస్ట్‌లో స్పష్టం చేశాడు.
విరాట్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. టీమిండియా దారుణంగా ఓడిపోయిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీతో తన వంతు పాత్ర పోషించాడు. వరల్డ్‌కప్ మొత్తం టాప్ ఫామ్‌లో ఉన్న విరాట్.. నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జయవర్దనె రికార్డును అధిగమించాడు. టీ20ల్లో 4 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచాడు. టీమిండియాకు ఈ వరల్డ్‌కప్ చేదు అనుభవాన్ని మిగిల్చినా.. ఓ బ్యాటర్‌గా విరాట్‌కు మాత్రం ఇది మరుపురాని వరల్డ్‌కప్ అనడంలో సందేహం లేదు.