Virat Kohli Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
Virat Kohli Record: టీ20ల్లో చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లి. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో విరాట్ రెండు రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. ఈ మధ్యే అతడు టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
Virat Kohli Record: విరాట్ కోహ్లి ఫామ్‌లోకి వస్తే రికార్డులు బ్రేక్ అవుతూనే ఉంటాయని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నదే. ఇప్పుడు జరుగుతోంది అదే. ఆసియాకప్‌లో ఎప్పుడైతే తిరిగి ఫామ్‌లోకి వచ్చాడో అప్పటి నుంచీ ఏదో ఒక రికార్డును బ్రేక్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లి రెండు రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కీలకమైన సమయంలో రాహుల్, రోహిత్ విఫలమైనా అతడు హార్దిక్ పాండ్యాతో కలిసి టీమ్‌ను ఆదుకున్నాడు. ఈ క్రమంలో 40 బాల్స్‌లోనే 50 రన్స్ చేసిన విరాట్.. టీ20ల్లో 4000 రన్స్ అందుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. టీ20 చరిత్రలో ఇప్పటి వరకూ ఏ ఇతర ప్లేయర్ ఈ మార్క్ అందుకోలేదు.
టీమిండియా తరఫున 115వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ ఈ ఘనత సాధించాడు. ఈ మధ్యే టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా జయవర్దనె రికార్డును అధిగమించిన విరాట్ కోహ్లి.. ఈ మ్యాచ్‌తో మరో రికార్డునూ సొంతం చేసుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో 100 ఫోర్లు బాదిన మూడో ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. శ్రీలంక మాజీ ప్లేయర్స్ జయవర్దనె, దిల్షాన్ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లో 100 ఫోర్లు బాదిన మూడో ప్లేయర్ విరాట్ కోహ్లి.
ఇంగ్లండ్‌పై విరాట్ 40 బాల్స్‌లో 50 రన్స్ చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో అతనికిది 4వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ముఖ్యంగా అడిలైడ్‌లో అతడు తిరుగులేని ఫామ్‌లో కొనసాగుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో రెండుసార్లు నాలుగు, అంతకంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ విరాట్ కోహ్లియే. అతడు 2014లోనూ విరాట్ నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. అడిలైడ్ ఓవల్‌లో మూడు టీ20 ఇన్నింగ్స్‌లో 204 రన్స్ చేసిన కోహ్లి తొలిసారి ఔటయ్యాడు.