BCCI Reviews Asia Cup: ఆసియాకప్‌లో టీమిండియా అసలు సమస్యేంటో గుర్తించిన బీసీసీఐ
BCCI Reviews Asia Cup: ఆసియాకప్‌లో టీమిండియా అసలు సమస్యేంటో బీసీసీఐ గుర్తించింది. ఈ టోర్నీలో ఇండియన్ టీమ్ వైఫల్యంపై బోర్డు చర్చించడంతోపాటు పరిష్కారాలపైన దృష్టిసారించింది.
BCCI Reviews Asia Cup: ఆసియాకప్ 2022లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది టీమిండియా. అంతకుముందు ఇంగ్లండ్, వెస్టిండీస్‌లలో సాధించిన టీ20 సిరీస్ విజయాలతో కాన్ఫిడెంట్‌గా కనిపించింది. బుమ్రాలాంటి సీనియర్ బౌలర్ లేకపోయినా లీగ్ స్టేజ్‌లో రెండు మ్యాచ్‌లూ గెలిచి తన ఫేవరెట్ హోదాకు తగినట్లే ఆడింది. అయితే సూపర్ 4కు వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. రెండు మ్యాచ్‌లలోనూ ఓడి ఫైనల్ కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది.
ఇప్పుడీ షాకింగ్ ఓటమిపై బీసీసీఐ సమీక్ష నిర్వహించింది. టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎంపిక చేసిన సమయంలోనే బీసీసీఐ ఆసియా కప్ ఓటమిపైనా చర్చించినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ టోర్నీలో టీమ్ ఎదుర్కొన్న సమస్యలు, టీ20 వరల్డ్‌కప్‌లో వాటిని అధిగమించేందుకు పరిష్కారాలపై బీసీసీఐ సమీక్షించింది.
మిడిల్ ఓవర్లలో బ్యాటింగే సమస్య
ముఖ్యంగా టీమ్ మిడిల్ ఓవర్లలో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడమే ప్రధాన సమస్యగా బోర్డు గుర్తించింది. 7 నుంచి 15 ఓవర్ల మధ్య మనోళ్లు బ్యాటింగ్ చేస్తున్న తీరు బీసీసీఐని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ సమీక్షలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాతోపాటు సెలక్షన్ కమిటీ కూడా పాల్గొంది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా చర్చ సాగినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.
దీంతోపాటు టీ20 వరల్డ్‌కప్‌లో మెరుగుపరచుకోవాల్సిన అంశాలపైనా మాట్లాడుకున్నట్లు ఆ అధికారి పీటీఐతో చెప్పారు. పెద్ద టీమ్స్‌తో మిడిల్ ఓవర్లలో టీమ్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుండటమే అసలు సమస్య అని అందరూ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. అయితే టీమ్‌లో వరల్డ్‌క్లాస్ ప్లేయర్స్ ఉన్నారని, వాళ్లు టీమ్ అవసరాలను తగినట్లు వాళ్ల ఆటను మలచుకోగలరని అన్నారు.
ఆసియాకప్‌ను సమీక్షిస్తున్న సమయంలో ఆ మధ్యలోని 9 ఓవర్లే ప్రతి మ్యాచ్‌లోనూ కొంప ముంచినట్లు గుర్తించారు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచినా ఈ 9 ఓవర్లలో కేవలం 59 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. హాంకాంగ్‌పై 62 రన్స్, పాకిస్థాన్‌పై సూపర్ 4 మ్యాచ్‌లోనూ 62 రన్స్ చేసింది. ముఖ్యంగా స్లో బౌలర్లను ఎదుర్కోవడంలో మన బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఈ సమస్యను టీ20 వరల్డ్‌కప్‌లో అధిగమించేలా వ్యూహాలు రచించనున్నారు.