India vs Australia: ఆస్ట్రేలియాకు కోలుకోలేని దెబ్బ.. స్టార్ పేస్ బౌలర్ ఔట్
India vs Australia: ఆస్ట్రేలియాకు కోలుకోలేని దెబ్బ పడింది. ఆ టీమ్ స్టార్ పేస్ బౌలర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అంతేకాదు మరో ముగ్గురు ప్లేయర్స్ కూడా తిరిగి స్వదేశానికి వెళ్లిపోనున్నారు.
India vs Australia: ఎనిమిదేళ్లుగా ఇండియా దగ్గరే ఉన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఈసారి ఎలాగైనా ఎగరేసుకుపోవాలని వచ్చిన ఆస్ట్రేలియాకు మరోసారి నిరాశే ఎదురైంది. తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆ టీమ్ ఇక ట్రోఫీ గెలిచే అవకాశం లేదు. తర్వాతి రెండు టెస్టుల్లో గెలిచినా సిరీస్ డ్రా అవుతుంది. ట్రోఫీ ఇండియా దగ్గరే ఉంటుంది. కానీ తర్వాతి మ్యాచ్ లు గెలవడం కాదు కదా దారుణంగా ఓడకుండా చాలన్నట్లుగా ఆ టీమ్ పరిస్థితి తయారైంది.
రెండు టెస్టుల్లోనూ మూడు రోజుల్లోపే చేతులెత్తేసిన ఆ టీమ్ కు మూడో టెస్టుకు ముందు కోలుకోలేని దెబ్బ పడింది. ఆ టీమ్ స్టార్ పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ మిగతా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. తొలి రెండు టెస్టులు కూడా అతడు గాయం కారణంగా ఆడని విషయం తెలిసిందే. మిగతా మ్యాచ్ లు కూడా అతడు ఆడబోవడం లేదని కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ వెల్లడించాడు.
అతనితోపాటు ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్పిన్నర్ ఆష్టన్ అగార్, మ్యాట్ రెన్షా కూడా స్వదేశానికి తిరిగి రానున్నట్లు ఆస్ట్రేలియా మీడియా తెలిపింది. ఒక్కో ప్లేయర్ టీమ్ కు దూరమవుతుండటంతో కంగారూల పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడినట్లు అయింది. ఇండియా స్పిన్నర్ల ధాటికి ఆసీస్ ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. మరోవైపు స్టార్ ప్లేయర్స్ స్టార్క్, గ్రీన్ లాంటి వాళ్లు ఇప్పటికీ గాయాలతో టీమ్ కు దూరంగా ఉండటం మింగుడు పడటం లేదు.
ఈ ఇద్దరూ మూడో టెస్టుకు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రీన్ అయితే 100 శాతం ఫిట్ గా ఉన్నట్లు కోచ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. అటు కెప్టెన్ కమిన్స్ కూడా వ్యక్తిగత పనుల కోసం హుటాహుటిన ఆస్ట్రేలియా వెళ్లాడు. అతడు మూడో టెస్టులోపు తిరిగి టీమ్ తో చేరనున్నాడు. ఆదివారం రెండో టెస్టు ముగిసిన కొద్ది గంటల్లోనే కమిన్స్ ఆస్ట్రేలియా ఫ్లైటెక్కాడు.
సంబంధిత కథనం