Impossible to beat Team India: టీమిండియాను వారి దేశంలో ఓడించడం కష్టం కాదు..అసాధ్యం.. పాక్ మాజీ షాకింగ్ కామెంట్స్
Impossible to beat Team India: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై పాక్ మాజీ రమీజ్ రజా ప్రశంసల వర్షం కురిపంచారు. టీమిండియాను వారి దేశంలో ఎవ్వరూ ఓడించలేరని స్పష్టం చేశారు.
Impossible to beat Team India: వీలు చిక్కినప్పుడల్లా భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కే పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా.. తాజాగా ప్రశంసల వర్షం కురిపించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని ప్రశంసించారు. ఇదే సమయంలో ఆసీస్ ప్లేయర్లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. టీమిండియాను వారి దేశంలో ఓడించడం అసాధ్యమంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు.
"ఇప్పుడు ఆస్ట్రేలియా మ్యాచ్‌లు ఎలా ముగుస్తున్నాయో.. అదే విధంగా ఒకప్పుడు పెర్త్, బ్రిస్బెన్ పిచ్‌లలో ఉపఖండపు జట్లతో మ్యాచ్‌లను వారు అలా ముగించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ముఖ్యంగా భారత్‌లో మంచి టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా లేదని ఈ ఫలితాలే చూపిస్తున్నాయి. భారత్‌లో టీమిండియాను ఓడించడం అసాధ్యం. స్పిన్ ఎదుర్కొలేక ఆసీస్ బ్యాటర్ల ప్రదర్శన అత్యంత సాధారణంగా సాగింది. ఒక సెషన్‌లో 9 వికెట్లు కోల్పోయిందంటే అర్థం చేసుకోవచ్చు. జడేజా అద్భుతమైన ప్రదర్శన చేశాడు." అని రమీజ్ రజా స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు రమీజ్. స్పిన్నర్లను ఎదుర్కొనలేక అత్యంత సాధారణంగా ఆడారని స్పష్టం చేశారు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆల్ రౌండర్ అర్ధశతకంతో ఆకట్టుకోవడంపై ప్రశంసల వర్షం కురిపించారు.
"అక్షర్ పటేల్ బ్యాటింగ్ చూస్తే 60 నుంచి 70 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గణనీయమైన ఆధిక్యాన్ని కలిగి ఉన్నప్పుడు అతడు అశ్విన్‌తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీన్ని బట్టి చూస్తే ఆసీస్ మానసికంగా బలంగా లేదని తెలుస్తోంది. వారి జట్టులో సాంకేతిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. షాట్ల ఎంపికలో పొరపాట్లు, స్వీప్ షాట్లు ఆడటం లాంటివి వారి పేలవ ప్రదర్శనను చూపిస్తున్నాయి." అని రమీజ్ రజా అన్నారు.
రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులతో మెరుగైన స్కోరు సాధించిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ను 262 పరుగులకు కట్టడి చేయడమే కాకుండా.. రెండో ఇన్నింగ్స్‌ను 61/1తో శుభారంభం చేసింది. మూడో రోజు భారత స్పిన్నర్లు తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడమే కాకుండా మ్యాచ్‌ను చేజిక్కించుకున్నారు. రవీంద్ర జడేజా 7 వికెట్లతో అదిరిపోయే ప్రదర్శన చేసి భారత్‌ను 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిపారు. మూడో టెస్టు అహ్మదబాద్ వేదికగా మార్చి 1 నుంచి మొదలు కానుంది.